కేబుల్ కట్.. ఇంటర్నెట్ బంద్.. మణికొండ RTO ఆఫీస్లో పనులు అయితలేవ్ !

కేబుల్ కట్.. ఇంటర్నెట్ బంద్.. మణికొండ RTO ఆఫీస్లో పనులు అయితలేవ్ !

రంగారెడ్డి జిల్లా: మణికొండ RTO ఆఫీస్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఎలక్ట్రికల్ స్తంభాలపై ఇష్టానుసారంగా కేబుల్స్, ఇంటర్నెట్ వైర్లను ఉండటంతో ఆ వైర్లను విద్యుత్ శాఖ కట్ చేసింది. ఈ కారణంగా.. మణికొండ RTO ఆఫీస్కు ఇంటర్నెట్ బంద్ అయింది. మణికొండ ఆర్టీవో కార్యాలయం నిత్యం రద్దీగా ఉంటుంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్ షిప్లో రోడ్ నెంబర్ 28లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ తీగలను గత శనివారం తొలగించిన సంగతి తెలిసిందే.

విద్యుత్ స్తంభాలపై 15 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో వేలాడుతున్న కేబుల్స్ను తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ స్తంభాలపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించడంతో.. మంగళవారం (ఆగస్ట్ 19, 2025) గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కరెంట్​స్తంభాలపై ఉన్న కేబుల్​వైర్లను తొలగించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. 

వై-ఫై కనెక్షన్లకు కూడా అంతరాయం కలిగింది. జియో, ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు ఉన్నట్టుండి ఇంటర్నెట్ బంద్ అయింది. ఈ పరిణామంతో ఇంటర్నెట్ బంద్ అయిందని, పునరుద్ధరించాలని వేల సంఖ్యలో ఎయిర్ టెల్, జియో బ్రాడ్ బ్యాండ్ విభాగానికి ఫిర్యాదులు అందాయి. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని గత ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినప్పటికీ, వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని డిస్కం వర్గాలు తెలిపాయి. TG SPDCL సీఎండీతో కేబుల్ ఆపరేటర్ల చర్చలు సఫలం అయిన తర్వాత వైర్లను కట్ చేయకూడదని TG SPDCL నిర్ణయించింది.