చేర్యాలలో మద్యం తాగేందుకు వచ్చి బెదిరించి చోరీ

చేర్యాలలో మద్యం తాగేందుకు వచ్చి  బెదిరించి చోరీ
  • దంపతుల ఇంట్లోకి చొరబడి    నగలు, నగదుతో పరార్  
  • సిద్దిపేట జిల్లా  నర్సాయపల్లిలో ఘటన 


చేర్యాల, వెలుగు : మద్యం తాగేందుకు  వచ్చిన దుండగులు బెదిరించి బంగారు నగలు, డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. మద్దూరు పోలీసులు తెలిపిన ప్రకారం.. మండలంలోని నర్సాయపల్లికి చెందిన యెల్ల కవిత, వెంకటేశ్ దంపతులు ఇంట్లో మద్యం అమ్ముతుంటారు.  

గురువారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మద్యం కోసం వచ్చారు. వారికి మద్యం అమ్మగా  ఇంటి ముందు కూర్చొని తాగారు. అనంతరం ఇంట్లోకి చొరబడి దంపతులను బెదిరించారు. కవిత మెడలోని 3 తులాల బంగారం, 2 తులాల పుస్తెల తాడు, రూ. 53 వేల నగదు తీసుకోగా..  బాధిత దంపతులు కేకలు వేయడంతో దుండగులు పారిపోయా రు. 

శుక్రవారం హుస్నాబాద్​ఏసీపీ, చేర్యాల సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధి తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మద్దూరు ఎస్ఐ  షేక్​ మహమూద్​ తెలిపారు.  


పోలీసులు వేధించారంటూ.. 


 చేర్యాల టౌన్ లోని మిల్క్ షాపులో పనిచేసే ముగ్గురిని అదేరోజు రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోగా.. విచారణ పేరుతో వేధించారని బాధిత యువకులు ఆరోపించారు.  చేర్యాల అంగడి బజార్​ నుంచి నర్సాయపల్లికి తీసుకెళ్లి సెల్​ఫోన్లు తీసుకోగా.. తాము కాదని తెలిసి వదిలేశారని తెలిపారు. 

ఘటనపై  చేర్యాల సీఐ ఎల్. శ్రీనును వివరణ కోరగా అనుమానంతోనే అదుపులోకి తీసుకుని విచారణ చేశామని,  వేధింపులకు గురి చేయలేదని  తెలిపారు.