ఆర్థిక అంశాలపై ప్రజలను ఎప్పుడూ చైతన్య పరిచే ప్రముఖ రచయిత, పెట్టుబడిదారు రాబర్ట్ కియోసాకీ తాజాగా తన క్రిప్టో పెట్టుబడులను విక్రయించారు. చాలా కాలంగా బిట్ కాయిన్, గోల్డ్, వెండిలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ.. కరెన్సీ కంటే అవే నిజమైన ఆస్తులుగా చెబుతూ వచ్చిన కియోసాకీ.. బిట్ కాయిన్ భారీ పతనంతో అలర్ట్ అయ్యారు. దీంతో తన పెట్టుబడులను లిక్విడేట్ చేసి వాటిని ఇతర ఆదాయ మార్గాల సృష్టి కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్లు చెప్పారు.
చాలా కాలంగా బుల్ జోరుతో దూసుకుపోతున్న క్రిప్టోలు ప్రస్తుతం నవంబరులో భారీ అమ్మకాలతో ఒత్తిడిలో చిక్కుకున్నాయి. దీంతో తమ జీవితకాల గరిష్ఠాల నుంచి బిట్ కాయిన్ 86వేల డాలర్ల దిగువకు చేరుకుంది. దీంతో 2022 తర్వాత తొలిసారిగా బిట్ కాయిన్ తన భారీ పతనాన్ని చూస్తోంది. పెద్ద పెట్టుబడిదారుల నుంచి కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి పతనాన్ని మరింతగా పెంచుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే శుక్రవారం పతనాని కంటే ప్రస్తుతం బిట్ కాయిన్ రేటు మెరుగుపడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ రాబోయే రేటు నిర్ణయం గురించి మార్కెట్ ఆసక్తిగా చూస్తోందని ఆర్బిట్ మార్కెట్స్ సహ వ్యవస్థాపకురాలు కరోలిన్ మౌరాన్ అన్నారు. బిట్‌కాయిన్ వారమంతా 80వేల డాలర్ల నుంచి 90వేల డాలర్ల పరిధిలో ట్రేడవుతుందని ఆమె అంచనా వేస్తున్నారు. అలాగే గత వారం బ్రేక్‌డౌన్ తర్వాత ట్రేడర్లు 85వేల200 డాలర్లను కీలక మద్దతు స్థాయిగా చూస్తున్నారని BTC మార్కెట్స్ నిపుణుడు రాచెల్ లూకాస్ అన్నారు.
