- జర్మనీలో ఇద్దరు యువకులు అరెస్ట్
బెర్లిన్: పదహారేండ్ల బాలికను ఓ రోబో అసభ్యంగా తడిమింది. ఈ ఘటన జర్మనీలోని కొలోన్లో ఒక ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్ వద్ద జరిగింది. ఆదివారం రాత్రి 11.45 గంటల సమయంలో కొలోన్లోని ఓ రెస్టారెంట్ బయట బాధిత బాలిక తన ఫ్రెండ్స్తో కలిసి నిలబడి ఉంది. సుమారు 1.2 మీటర్ల ఎత్తు ఉన్న రెడ్ కలర్ రోబో వెనుక నుంచి బాలికను అసభ్యంగా తడిమినట్లు డైలీ మెయిల్ అనే వార్త సంస్థ పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని 16, 19 ఏండ్ల ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను వేధించడానికి వారే ఆ రోబోను వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికను రోబో తడుముతున్న సమయంలో ఆ మైనర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితులకు చెందిన కారు డిక్కిలో రోబోను కనుగొన్నారు. అలాగే, వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆ ఇద్దరు నిందితులు ఈ పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
