
సూర్యాపేట జిల్లా: మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ వెంట ఉన్న ప్రజాప్రతినిధుల వాహనాలపై ఓ వ్యక్తి రాళ్ళతో దాడి చేశాడు. ఈ ఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసం కాగా.. మంత్రి వెంట ఉన్న నాయకులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామం లో ఈ ఘటన జరిగింది.
అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఉండ్రుగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మి నర్సింహ దేవస్థానం వద్ద శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ వెంట ఉన్న ప్రజా ప్రతినిధుల వాహనాల పై అదే గ్రామానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తి రాళ్ళ తో దాడి చేశాడు. ఈ దాడిలో అక్కల దేవి గూడెం సర్పంచ్ పుట్ట గురువేందర్ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అవగా, ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన కారు డోర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి.ఈ దాడిలో కారులో ఉన్న వాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి.ఈ క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి వాహనం ముందుగానే వెళ్లడం తో ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన నాగరాజుకు కొద్దిగా మానసిక వ్యాధితో బాధపడుతున్న ట్లు తెలుస్తోంది.