కెరమెరి అడవుల్లో రాక్​ పిల్లర్స్

కెరమెరి అడవుల్లో రాక్​ పిల్లర్స్
  • బోర్ లాల్ గూడ ఫారెస్ట్ లో గుర్తింపు 
  • ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం నాటివిగా నిర్ధారణ

హైదరాబాద్, వెలుగు: కుమ్రంభీం -ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బోర్​లాల్ గూడ రిజర్వ్ ఫారెస్టులోని చిన్నరాళ్లగుట్టపై రాక్ పిల్లర్స్​వెలిశాయి. ప్రకృతి పోతపోసినట్లుగా ఉన్న ఈ శిలా స్తంభాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు తిరుపతి గిత్తే, ఆయన మిత్ర బృందం గుర్తించింది. ఆరున్నర కోట్ల ఏండ్ల క్రితం దక్కన్ ద్వీపకల్ప భూమిలో భూగర్భం నుంచి ఎగిసిన లావా దళసరి పొరగా, బల్లపరుపుగా పరచుకుని దక్కన్ ట్రాప్స్​గా 5 లక్షల చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉందని భూ భౌతిక విజ్ఞానవేత్త, జీఎస్సై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్ వెల్లడించారు. లావా ప్రవహించి చల్లబడటంతో మధ్య, పశ్చిమ భారతదేశంలోని అనేకచోట్ల లావాశిలలు వెలిశాయి. వీటిని ‘కాలమ్నార్ బసాల్ట్’ అని పిలుస్తారు. మధ్యప్రదేశ్​లోని కాన్వాడ పహాడ్, పలాసి (బగ్లీ సమీపంలో), మానవార్, కోటెడల, గుజరాత్ అంజర్ కచ్​లోని ధీమాధర్, మహారాష్ట్రలోని అంధేరి గిల్బర్ట్ హిల్ పై, ఇటీవల కొల్లాపూర్, ఉస్మానాబాద్, బీడ్ చించోలిలో రాక్​పిల్లర్స్ వెలుగు చూశాయి. బోర్ లాల్ గూడ కాలమ్నార్లు చించోలి స్తంభాలను పోలి ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. 2015లో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో ‘బసాల్ట్స్’ను బృందం సభ్యుడు మన్నె ఏలియా మిత్రబృందం గుర్తించింది. బోర్ లాల్ గూడ అడ‌‌‌‌‌‌‌‌వుల్లో కనిపించినవి రెండో ప్రాంతమని హరగోపాల్ తెలిపారు. వీటిని పరిరక్షించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.