రన్నరప్‌‌తో సరి .. యూఎస్‌‌ ఓపెన్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి

రన్నరప్‌‌తో సరి .. యూఎస్‌‌ ఓపెన్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి

న్యూయార్క్‌‌:  ఇండియా వెటరన్‌‌ ప్లేయర్‌‌ రోహన్‌‌ బోపన్న యూఎస్‌‌ ఓపెన్‌‌లో తుది మెట్టుపై బోల్తా కొట్టారు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో ఆరోసీడ్‌‌ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌‌ (ఆస్ట్రేలియా) 6–2, 3–6, 4–6తో మూడోసీడ్‌‌ రాజీవ్‌‌ రామ్‌‌ (అమెరికా)–జో సాలిస్‌‌బరి (బ్రిటన్‌‌) చేతిలో ఓడారు. కెరీర్‌‌లో రెండోసారి మెన్స్​ డబుల్స్​ గ్రాండ్‌‌స్లామ్‌‌ ఫైనల్‌‌ చేరిన బోపన్న రన్నరప్‌‌తోనే సరిపెట్టుకున్నాడు. రెండు గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌‌లో బోపన్న ద్వయం చివరి రెండు సెట్లలో చతికిలపడింది. 

తొలి సెట్‌‌ ఆరంభంలో క్రాస్‌‌ కోర్టు ర్యాలీలు, ఫోర్‌‌హ్యాండ్‌‌ షాట్లతో చెలరేగిన బోపన్న–ఎబ్డెన్‌‌ ఈజీగా సెట్‌‌ను సొంతం చేసుకున్నారు. కానీ రెండో సెట్‌‌లో సీన్‌‌ రివర్సయ్యింది. బలమైన బేస్‌‌ లైన్‌‌ గేమ్‌‌తో చెలరేగిన రామ్‌‌–సాలిస్‌‌బరి మూడుసార్లు బోపన్న జంట సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేశారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో యూఎస్‌‌–బ్రిటన్‌‌ జోడీ హవానే కొనసాగింది. 2–2తో స్కోరు సమమైన తర్వాత వరుస పాయింట్లతో రాజీవ్‌‌ హడలెత్తించాడు. కీలక టైమ్‌‌లో ప్రత్యర్థుల సర్వీస్‌‌లను బ్రేక్‌‌ చేసి సెట్‌‌తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మ్యాచ్‌‌ మొత్తంలో తమ సర్వీస్‌‌లో ఎక్కువ పాయింట్లు నెగ్గిన రాజీవ్‌‌–సాలిస్‌‌బరి రెండు బ్రేక్‌‌ పాయింట్లను కాచుకున్నారు. అయితే 8 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ మాత్రమే చేసి గట్టెక్కారు. 15 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌, 5 డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసిన బోపన్న జంట మూల్యం చెల్లించుకుంది. 

ఫైనల్లో సబలెంక X గాఫ్‌‌

విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో అరీనా సబలెంక, కోకో గాఫ్‌‌ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన సెమీస్‌‌లో రెండో సీడ్‌‌ సబలెంక (బెలారస్‌‌) 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్‌‌ మాడిసన్‌‌ కీస్‌‌ (అమెరికా)పై గెలిచింది. 2 గంటలా 32 నిమిషాల మ్యాచ్‌‌లో కీస్‌‌ ఆరంభంలో అదరగొట్టింది. కార్నర్‌‌, బేస్‌‌ లైన్‌‌, క్రాస్‌‌ కోర్టు ర్యాలీస్‌‌తో ఈజీగా తొలి సెట్‌‌ను సొంతం చేసుకుంది. అప్పటికే నిరాశకు లోనైన సబలెంక అనవసర తప్పిదాలతో మరింత ఒత్తిడికి లోనైంది. ఫలితంగా రెండో సెట్‌‌లోనూ 1–2తో వెనకబడింది. ఈ దశలో కోచ్‌‌ తీవ్రంగా హెచ్చరించడంతో మ్యాచ్‌‌పై దృష్టి పెట్టిన బెలారస్‌‌ ప్లేయర్‌‌ బలమైన సర్వీస్‌‌లతో చెలరేగింది. 

కీస్‌‌ 5–4 ఉన్న దశలో బ్రేక్‌‌ పాయింట్‌‌ను కాచుకుని సెట్‌‌ను టైబ్రేక్‌‌లో గెలుచుకుంది. మూడో సెట్‌‌లోనూ ఇద్దరు ప్రతి పాయింట్‌‌ కోసం హోరాహోరీగా తలపడ్డారు. కీస్‌‌ ఫోర్‌‌ హ్యాండ్‌‌ షాట్లతో రెచ్చిపోతే సబలెంక క్రాస్‌‌ కోర్టు విన్నర్లతో స్కోరును సమం చేసింది. 10 పాయింట్స్‌‌ టై బ్రేక్‌‌లో 7–3 లీడ్‌‌లో నిలిచిన సబలెంక ఈజీగా  విజయాన్ని సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌‌లో ఆరోసీడ్‌‌ గాఫ్‌‌ (అమెరికా) 6–4, 7–5తో కరోలినా ముచోవా (చెక్‌‌)ను ఓడించి టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌‌ మొత్తంలో ఒక ఏస్‌‌, రెండు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసిన గాఫ్‌‌ 5 బ్రేక్‌‌ పాయింట్లను కాపాడుకుంది. 13 విన్నర్లు కొట్టి 25 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేసింది.