
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) చాన్నాళ్ల తర్వాత లెజెండరీ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్లూ జెర్సీలో తిరిగి గ్రౌండ్‌లోకి దిగిన ఆనందం అభిమానులకు ఎంతోసేపు లేకుండా పోయింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో టీమిండియా 2027 వన్డే వరల్డ్ కప్ కోసం తమ జర్నీని మొదలెట్టగా.. లెజెండ్స్‌తో పాటు టీమ్‌కు తొలి అడుగులోనే ఎదురుదెబ్బ తగిలింది.
పెర్త్ గ్రౌండ్‌లో జరిగిన తొలి వన్డేలో రోహిత్, కోహ్లీతో పాటు కొత్త వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా - ఫెయిలవడం ఆందోళన కలిగిస్తోంది. జట్టుకు వెన్నెముక లాంటి ఈ ముగ్గురూ కలిసికట్టుగా ఎదుర్కొన్నది కేవలం 46 బాల్స్. చేసింది 19 రన్స్ మాత్రమే. ఇది కేవలం ఒక మ్యాచ్ ఓటమి కాదు, రాబోయే వరల్డ్ కప్ ప్లాన్స్‌కు ఓ హెచ్చరిక అనొచ్చు. కోహ్లీ, రోహిత్, అయ్యర్ టీమిండియా వన్డే సెటప్‌లో అత్యంత కీలకమైన బ్యాటర్లు.
ప్రస్తుతం ఈ ముగ్గురూ ఒకే ఫార్మాట్ అడుతున్నారు. టీ20లు, టెస్టులకు ‘రోకో’ రిటైర్మెంట్ ఇవ్వగా.. రెడ్ బాల్ క్రికెట్‌కు ఆరు నెలల బ్రేక్ ఇచ్చిన అయ్యర్‌ను మేనేజ్‌మెంట్ టీ20 సెటప్ నుంచి దూరంగా ఉంచింది. మరోవైపు 2023-–27ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో భాగంగా ఇండియా 27 వన్డేలు ఆడుతోంది. బంగ్లాదేశ్‌తో గత ఆగస్టులో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ పోస్ట్‌పోన్ అవ్వగా.. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేతో 2027 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌ను ఇండియా స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. కానీ, ముగ్గురు బ్యాటర్ల ఫెయిల్యూర్ కారణంగా ఇండియా ఓటమితో ఈ సిరీస్‌ను మొదలెట్టింది. వీళ్ల వైఫల్యానికి ప్రధాన కారణం తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమే అనొచ్చు. జూన్‌లో ఐపీఎల్ తర్వాత రోహిత్ , విరాట్ దాదాపు ఐదు నెలల (140 రోజుల) సుదీర్ఘ విరామం తర్వాత ఆడిన తొలి కాంపిటీషన్ ఇదే.
ఈ లాంగ్ గ్యాప్ వాళ్ల ఆటలో స్పష్టంగా కనిపించింది. ఇద్దరి బ్యాట్‌లో పదును పూర్తిగా తగ్గినట్టు, బాల్‌ను అంచనా వేయడంలో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపించింది. మరోవైపు, ఇండియా–ఎతో పాటు దులీప్ ట్రోఫీలో ఆడిన శ్రేయస్ ఆటలో సాంకేతిక లోపాలు మరోసారి బయటపడ్డాయి. దాంతో ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా నెట్స్‌లో చేసే ప్రాక్టీస్, అసలైన మ్యాచ్‌లో ఎదురయ్యే ఒత్తిడికి ప్రత్యామ్నాయం కాదని మరోసారి రుజువైంది.
ఎక్స్‌ట్రా బౌన్స్‌కు బోల్తా
పెర్త్ వాకా స్టేడియం పిచ్ సహజంగానే బౌన్స్‌కు ప్రసిద్ధి. ఈ అవకాశాన్ని ఆస్ట్రేలియా పొడగరి బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. వీళ్ల బాల్స్ దాదాపు 7 అడుగుల ఎత్తు నుంచి రిలీజ్ అవుతూ పిచ్‌పై పడ్డాక అనూహ్యంగా బౌన్స్ అయ్యాయి. ఇండియా టాపార్డర్ ఈ ఎక్స్‌ట్రా బౌన్స్ దెబ్బకు కుదేలైంది. హేజిల్‌వుడ్ వేసిన డెలివరీ షార్ట్ పిచ్ కాకపోయినా, ఊహించని విధంగా బౌన్స్ అయి రోహిత్ ఛాతి ఎత్తులోకి దూసుకొచ్చింది.
దాన్ని వదిలేయడానికి బదులు ఆడటానికి ప్రయత్నించిన హిట్‌మ్యాన్ బ్యాట్ పైభాగానికి తగిలించి ఔటయ్యాడు. అది పిచ్ మహిమ కంటే బౌలర్ నైపుణ్యానికి నిదర్శనం అనొచ్చు. ఇక, కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో తొలిసారి డకౌటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో ఖాతా తెరవాలన్న తొందరపాటుతో, ఒత్తిడికి లోనై బాడీకి దూరంగా వెళ్తున్న బాల్‌ను వెంటాడి క్యాచ్ ఇచ్చాడు.
వన్డేల్లో కింగ్‌గా వెలుగొందే కోహ్లీ నుంచి ఇలాంటి షాట్ చూడటం చాలా అరుదు. గత రెండు ఐసీసీ టోర్నీల్లో అదరగొట్టిన అయ్యర్ మరోసారి షార్ట్ పిచ్ బలహీనత బయటపెట్టాడు. హేజిల్‌వుడ్ పక్కటెముకల వైపు దూసుకొస్తున్న బౌన్సర్లతో అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ ఎక్స్‌ట్రా బౌన్స్‌ను అయ్యర్ అడ్జస్ట్ చేసుకునే క్రమంలో బాల్ అతని గ్లవ్స్‌ను తాకి క్యాచ్‌గా వెళ్లింది.
ఐపీఎల్ సరిపోదు డొమెస్టిక్ ఆడాల్సిందే
పెర్త్ ఫెయిల్యూర్ తర్వాత రోహిత్, కోహ్లీ కేవలం ఐపీఎల్‌లో ఆడటం ద్వారా వన్డే వరల్డ్ కప్‌కు సిద్ధమవ్వడం అసాధ్యం అనొచ్చు. రెడ్ బాల్ క్రికెట్‌కు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చినప్పటికీ శ్రేయస్ ఇండియా–ఎ తరఫున ఆడటంతో ముంబై తరఫున విజయ్ హజారే టోర్నీకి సిద్ధంగా ఉండనున్నాడు. రోకో 2023 వరల్డ్ కప్ ఫైనల్లో చెదిరిన తమ కలను 2027లో అయినా సాకారం చేసుకోవాలంటే ప్లాన్స్‌ను మార్చుకోవాలి.
మ్యాచ్ ఫిట్‌నెస్, ఫామ్ కోల్పోకుండా ఉండాలంటే విజయ్ హజారే వంటి డొమెస్టిక్ 50 ఓవర్ల టోర్నమెంట్లలో ఆడాల్సిందే. ఇప్పటికే రోకో 2027 వరల్డ్ కప్ ప్లాన్స్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు కోచ్ గౌతమ్ గంభీర్ ఆ టోర్నీకి ఇంకా సమయం ఉంది అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. ఈ లెక్కన ఈ సీనియర్ స్టార్లు మ్యాచ్ సవాల్‌కు -సిద్ధంగా ఉండకపోతే, టీమ్ మేనేజ్‌మెంట్ మరో దారి చూసుకోవాల్సి వస్తుంది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి యంగ్ టాలెంట్స్‌కు మరిన్ని అవకాశాలు ఇచ్చి, వారిని 2027 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడుతుంది.
2027 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా సవాల్‌కు సిద్ధమా?
రోహిత్, కోహ్లీ, అయ్యర్ ఔటైన తీరు టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెట్టడానికి అసలు కారణం 2027 వరల్డ్ కప్. ఎందుకంటే ఆ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడి పిచ్‌లు కూడా పెర్త్ మాదిరిగానే పేస్, బౌన్స్‌కు పెట్టింది పేరు. అలాంటి సవాల్‌ను ఎదుర్కోవడానికి టీమిండియాకు సరైన సన్నాహకాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న.
2027 వరల్డ్‌కప్ లోపు ఇండియా ఫారిన్ బౌన్సీ ట్రాక్‌లపై రెండే వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఒకటి ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ కాగా, మరోటి వచ్చే జులైలో ఇంగ్లండ్‌తో జరగనుంది. అయితే, ఇంగ్లండ్ కూడా తమ ‘బజ్‌బాల్’ వ్యూహానికి అనుకూలంగా ఫ్లాట్ వికెట్లను తయారుచేస్తుండటంతో అక్కడి పిచ్‌లలో పాత పదును తగ్గిపోయింది. అంటే, సౌతాఫ్రికాలో వరల్డ్ కప్ సవాల్‌కు సిద్ధమవడానికి మనకు సరైన అవకాశాలు దాదాపు లేనట్లే.