
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై గత కొంతకాలంగా వన్డే రిటైర్మెంట్ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి వన్డే కెరీర్ ఇక ముగిసిందని.. జట్టుకు వీరి అవసరం ఇక లేదని.. బీసీసీఐ యంగ్ ఇండియా వైపు అడుగులు వేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రోకో జోడీ వన్డే ర్యాంకింగ్స్ లో చాటారు. ఐసీసీ బుధవారం (ఆగస్టు 13) రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో రోహిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (736) నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఘోరంగా విఫలం కావడంతో మూడో స్థానికి పడిపోయాడు.
బాబర్ (751) విఫలం కావడంతో రోహిత్ (756) రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. తొలి స్థానంలో టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ (784) కొనసాగుతున్నాడు. టాప్ -4 ఏకంగా ముగ్గురు టీమిండియా క్రికెటర్లు ఉండడం విశేషం. డారిల్ మిచెల్ టాప్-5 బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్, గిల్ అద్భుతంగా రాణించారు. ఇతర భారత క్రికెటర్లలో శ్రేయాస్ అయ్యర్ 8 వ ర్యాంక్ లో నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ 15 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. టీ20 ర్యాంకింగ్స్ లో కూడా టాప్-2 లో టీమిండియా ప్లేయర్స్ కావడం విశేషం. తొలి స్థానంలో అభిషేక్ శర్మ, రెండో స్థానంలో తిలక్ వర్మ నిలిచారు.
బౌలింగ్ విషయానికి వస్తే శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ 671 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో ఉండగా.. జడేజా 9 ర్యాంక్ లో నిలిచాడు. ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ 14 వ స్థానంలో.. సిరాజ్ 15 వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవలే పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన వెస్టిండీస్ స్పిన్నర్ గుడాకేష్ మోతీ ఐదు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకోవడం హైలెట్ గా నిలిచింది. ఆల్ రౌండర్ విభాగానికి వస్తే జడేజా ఒక్కడే టీమిండియా నుంచి 10 స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ ఓమర్జాయ్ అగ్ర స్థానంలో ఉన్నాడు.