కష్టపడ్డాం..విజయం సాధించాం: రోహిత్ శర్మ

కష్టపడ్డాం..విజయం సాధించాం: రోహిత్ శర్మ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్ను 2-1తో దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నాడు. భారత ఆటగాళ్లు కఠిన పరిస్థితుల్లో పరుగులు చేయడంతో పాటు..వికెట్లు తీశారని మెచ్చుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి విజయం సాధించినట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అద్భుతంగా జరిగిందని రోహిత్ శర్మ తెలిపాడు. టీమిండియాలోని చాలా మంది తొలిసారి ఈ సిరీస్ ఆడారని..వారంతా విజయం కోసం కష్టపడ్డారని గుర్తు ప్రశంసించాడు. ఈ సిరీస్లో తమకు ఎన్నో సవాళ్లు ఎదరయ్యాయని..వాటన్నింటికి ధీటుగా బదులిచ్చామని చెప్పారు. తొలి రెండు టెస్టుల్లో గెలుపు అద్బుతమని..ముఖ్యంగా ఢిల్లీ టెస్టులో తమ ప్రదర్శనకు గర్వపడుతున్నట్లు చెప్పాడు. ఆ మ్యాచులో కఠిన పరిస్థితుల నుంచి గట్టెక్కి విజయం సాధించామన్నాడు. అయితే ఇండోర్ టెస్టులో ఒత్తిడికి గురై ఓడిపోయామన్నాడు. 

టెస్టు క్రికెట్ కష్టమైన ఫార్మాట్ అని రోహిత్ శర్మ అన్నాడు. టెస్టుల్లో రాణించడం అంత సులువైన పనికాదన్నాడు. కానీ ఈ సిరీస్లో తమ ఆటగాళ్లంతా సత్తా చాటారని మెచ్చుకున్నాడు. అందరూ బాధ్యతగా ఆడారని..వారి ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు. మొత్తానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా  సొంతం చేసుకుంది. అహ్మదాబాద్  టెస్ట్ డ్రాగా ముగియడంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ను భారత జట్టు 2-1తో దక్కించుకుంది. ఇక టీమిండియాకు ఇది వరుసగా నాలుగో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం కావడం విశేషం.  2017, 2018-19, 2020-21, 2023 సిరీస్‌లను టీమిండియానే  గెలుచుకుంది.