ఆసీస్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కిన రోహిత్‌‌

ఆసీస్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కిన రోహిత్‌‌

 

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ ముగిసినప్పటి నుంచి నెలకొన్న  సస్పెన్స్‌‌కు తెరదించుతూ టీమిండియా స్టార్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రోహిత్‌‌ శర్మ ఆస్ట్రేలియా బయలుదేరాడు. బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు పయనమయ్యాడు. మంగళవారం వేకువజామున రోహిత్‌‌ ఆసీస్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌‌ మీదుగా ముంబైకర్‌‌ ఆసీస్‌‌ చేరుకుంటాడని, అనంతరం క్వారంటైన్‌‌లోకి వెళతాడని తెలియజేశాయి. ప్రస్తుతమున్న క్వారంటైన్‌‌ రూల్స్‌‌ ప్రకారం రోహిత్‌‌ మూడో టెస్ట్‌‌ నాటికి జట్టుకి అందుబాటులోకి రానున్నాడు. క్వారంటైన్‌‌లో ఉంటూ రోహిత్‌‌ ఫిట్‌‌నెస్‌‌ పెంచుకోవడంపై దృష్టి పెడతాడని బోర్డు వర్గాలు చెప్పాయి.

, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌‌లో హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీకి గురైన ముంబై ఇండియన్స్‌‌ కెప్టెన్‌‌ ఆ సీజన్‌‌లో కొన్ని మ్యాచ్‌‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌‌తో పాటు ఫైనల్‌‌లో బరిలోకి దిగాడు. దీంతో అతను మిగిలిన జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళతాడని అంతా భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా స్వదేశానికి వచ్చిన రోహిత్‌‌.. బెంగళూరులోని నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ(ఎన్‌‌సీఏ)లో రిహాబిలిటేషన్‌‌లో పాల్గొన్నాడు. స్టార్‌‌ బ్యాట్స్‌‌మన్ ఫిట్‌‌నెస్‌‌పై ఎన్‌‌సీఏ ఫిజియోలు శుక్రవారం క్లీన్‌‌చిట్‌‌ ఇవ్వడంతో ఇప్పుడు ఆసీస్‌‌ బయలుదేరాడు. కానీ, ఈలోపు రకరకాల కామెంట్లు బయటకు రావడంతో రోహిత్‌‌ ఫిట్‌‌నెస్‌‌పై తీవ్ర చర్చ జరిగింది. అసలు రోహిత్‌‌ తమతో కలిసి ఆస్ట్రేలియాకు ఎందుకు రాలేదో తనకు కూడా తెలియదని కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ కామెంట్‌‌ చేయడంతో చర్చ తారాస్థాయికి చేరింది. అయితే, తండ్రి అనారోగ్యం వల్లనే రోహిత్‌‌ స్వదేశానికి తిరిగి వచ్చాడని ప్రకటించి బీసీసీఐ సెక్రటరీ జైషా ఆ చర్చకు బ్రేకులేశారు.