
న్యూఢిల్లీ: టెస్టు, టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడరని లెజెండరీ బ్యాటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరి అది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఈ ఇద్దరూ రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఆడరు. కాకపోతే ఫామ్‌లో ఉండి భారీగా రన్స్ చేస్తుంటే దేవుడు కూడా వీళ్లను జట్టు నుంచి తప్పించలేడు. వన్డేల్లో బాగా ఆడే వీళ్లు 2027 వరకు వీళ్లు ఫామ్‌లో ఉంటారా? ఇదే దూకుడు, నిలకడ ఉంటుందా? టీమ్‌కు అవసరమయ్యే ఆట వీళ్లు ఆడగలరా? సెలెక్షన్ కమిటీ వీటినే పరిగణనలోకి తీసుకుంటుంది.
ఒకవేళ ఆ సత్తా ఉందని కమిటీ భావిస్తే జట్టులో ఉంటారు. లేదంటే ఈ ఇద్దరు ఆ వరల్డ్ కప్‌లో ఆడే చాన్సెస్ చాలా తక్కువే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అని సన్నీ వెల్లడించాడు. సెలెక్టర్లతో చర్చించిన తర్వాతే రోహిత్, విరాట్ వీడ్కోలు నిర్ణయం తీసుకుని ఉంటారన్నారు. ఇండియా క్రికెట్ ప్రయోజనాల కోసం పని చేసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నానని గావస్కర్ చెప్పాడు.
‘నేను ఎప్పుడూ సెలెక్టర్‌గా పని చేయలేదు. కాబట్టి అంతర్గత విషయాలు నాకు తెలియవు. కానీ ఎవరైనా టీమ్ అభివృద్ధిని కోరుకుంటాం. చాలా వేగంతో ముందుకెళ్లాలని ఆశిస్తారు. మందకొడిగా ఉండాలని ఎవరూ అనుకోరు. అందుకే ఆట డిమాండ్‌ను బట్టి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తప్పవు. సెలెక్టర్లు కూడా అదే
చేశారని అనుకుంటున్నా’ అని గావస్కర్ వివరించాడు.