టాలీవుడ్ అగ్రనటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి మళ్ళీ వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె నటించిన 'లెనిన్ పాండియన్' విడుదలకు రెడీ అవుతుండగా.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు.
పవర్ ఫుల్ మదర్ పాత్రలో రోజా
2015లో వచ్చిన 'ఎన్ వళి తని వళి' తర్వాత రోజా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామ తర్వాత తిరిగి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇటీవల 'లెనిన్ పాండియన్' అనే తమిళ చిత్రంతో వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఇప్పుడు మరో సినిమాకు ఒకే చెప్పేసింది. 'జామా' (Jama) చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పరి ఇళవళగన్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోకి తల్లిగా ఒక కీలకమైన, పవర్ ఫుల్ పాత్రలో రోజా కనిపించబోతున్నారు.
దర్శకుడు పరి మాట్లాడుతూ.. ఈ పాత్రకు రోజా అయితేనే న్యాయం చేయగలరని ఆమెను సంప్రదించాం. ఆమె నటనలో ఒక రకమైన పవర్ ఉంటుంది, అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. షూటింగ్ సెట్‌లో ఆమె చాలా సరదాగా ఉంటారు అని చెప్పుకొచ్చారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో రోజాతో పాటు మరికొంతమంది ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. ధనుష్ దర్శకత్వం వహించిన 'నీలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోపం' (NEEK) ఫేమ్ రమ్య రంగనాథన్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నటుడు చేతన్ హీరో తండ్రిగా, రోజాకు జోడీగా కనిపిస్తారు. విలక్షణ నటుడు కలైయరసన్ కుమార్తె అదితి ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతోంది.
జాలీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
తన మొదటి సినిమా 'జామా'లో జానపద కళాకారుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన పరి, ఈసారి రూట్ మార్చారు. ఈ సినిమాను ఒక కంప్లీట్ జాలీ రామ్-కామ్ (Rom-com), ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు నా నుండి మళ్ళీ 'జామా' లాంటి సీరియస్ డ్రామాను ఆశిస్తారు. కానీ నేను ఒకే జోనర్‌కు పరిమితం అవ్వకూడదని ఈ మోడ్రన్ ఫ్యామిలీ కథను సిద్ధం చేశాను అని పరి వివరించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.
రోజా సెకండ్ ఇన్నింగ్స్ వ్యూహం
రాజకీయాల నుంచి చిన్న విరామం దొరకడంతో, రోజా తన పాత వృత్తిపై దృష్టి పెట్టారు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా సౌత్ ఇండియాను ఏలిన ఆమె, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణించాలని చూస్తున్నారు. నదియా, రమ్యకృష్ణ తరహాలో పవర్‌ఫుల్ తల్లి లేదా అత్త పాత్రలకు రోజా బెస్ట్ ఛాయిస్ అవుతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా పేరును త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. రోజా ఎంట్రీతో ఈ చిన్న సినిమాకు ఇప్పుడే భారీ హైప్ వచ్చేసింది!
