యంగ్ హీరో, ' మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనన్యగా ఆకట్టుకున్న అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన 'రొమాంచకం' . భారీ అంచనాల మధ్య ఈ రోజు ( సెప్టెంబర్ 3, 2026 ) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, సిట్యువేషనల్ కామెడీని ప్రధానంగా నమ్ముకున్న ఈ సినిమాను వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ మూవీపై విడుదలకు ముందే ఆసక్తి నెలకొంది. మరి థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.....
కథేంటంటే..
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఓ స్టార్టప్ నడుపుతూ లైఫ్‌ను తనదైన స్టైల్‌లో ఎంజాయ్ చేసే కుర్రాడు. చెన్నైకి చెందిన మైథిలీ (అనంతిక సనిల్‌కుమార్) అనే అమ్మాయితో లవ్‌లో పడతాడు . అయితే అన్వేష్‌ను కలవడానికి మైథిలీ హైదరాబాద్ రావడంతో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమె రాకతో అన్వేష్‌తో పాటు అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అసలు మైథిలీకి ఏం జరిగింది? ఆ సమస్య ఏమిటి? అన్వేష్ అండ్ గ్యాంగ్ దాని నుంచి ఎలా బయటపడ్డారు? ఈ గందరగోళమే 'రొమాంచకం' అసలు కథ.
సినిమా ఎలా ఉంది..
'రొమాంచకం' కథ కంటే కామెడీనే ఎక్కువగా నమ్ముకున్న సినిమా. 'జాతిరత్నాలు' తరహాలో సీరియస్ స్టోరీని పక్కనపెట్టి సిట్యువేషన్స్, పాత్రల అమాయకత్వం, కన్ఫ్యూజన్, పంచ్ డైలాగ్స్‌తో నవ్వించేందుకు ప్రయత్నించింది. కొన్ని చోట్ల ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ కాస్త నిమ్మలంగా సాగుతుంది. కాస్త సాగదీతగా అనుపిస్తుందంటున్నారు ప్రేక్షకులు.
అయితే ముఖ్యంగా సెకండాఫ్‌లో వినోదం నవ్వులు పూయిస్తోందంటున్నారు సినీ ప్రియులు. ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూ అల్లుకున్న ఎపిసోడ్స్ మంచి వినోదాన్ని పంచుతాయి. ఒక సమస్య నుంచి మరో సమస్యకు కథ వెళ్తూ, పరిస్థితులు మరింత గందరగోళంగా మారే కొద్దీ కామెడీ కూడా పెరుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ సినిమాకు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. థియేటర్లలో ఫుల్ ఎంజాయ్ దొరుకుతుందంటున్నారు ప్రేక్షకులు.
ఎవరెలా చేశారంటే?
సుమంత్ ప్రభాస్ తన పాత్రలో చాలా నేచురల్‌గా కనిపించాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో అతని ఈజ్ ఆకట్టుకుంటుంది. అనంతికతో అతని కెమిస్ట్రీ కూడా బాగుంది. అనంతిక తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుని, మైతిలి పాత్రకు న్యాయం చేసిందంటున్నారు సగటు ప్రేక్షకులు. ఈ సినిమాకు ఫ్రెండ్స్ గ్యాంగ్ మరో ప్రధాన బలం. వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ తమ పరిధిలో నవ్వించారు. అయితే నరేంద్ర రవి ప్రత్యేకంగా మెప్పిస్తాడు. అతని టైమింగ్, పంచ్ డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ మంచి నవ్వులు తెప్పిస్తాయి. ఉపేంద్ర లిమయే కూడా తనదైన స్టైల్‌లో కామెడీ పండించాడు.
ఎక్కడ మైనస్ అయిందంటే?
కథలో పెద్దగా కొత్తదనం లేదు. ఎమోషన్స్, సెల్ఫ్ రియలైజేషన్ అని సీరియస్ టచ్ ఇవ్వడానికి ట్రై చేసిన ప్రతిసారి పేస్ నెమ్మదిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య వచ్చే ఒక సాంగ్ ఎడిటింగ్‌లో లేపేస్తే ఇంకా బెటర్‌గా ఉండేది. అలాగే ప్రేమ, సెల్ఫ్ రియలైజేషన్ వంటి ఎమోషనల్ అంశాలను టచ్ చేసినా, అవి కామెడీ స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.
సినిమాకు ప్లస్ ...
ఇక వాసుకి వైభవ్ సంగీతం సినిమాకు ప్లస్. పాటలు వినసొంపుగా ఉండటంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్లకు మంచి ఎనర్జీ ఇచ్చింది. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ ఫ్రెష్, బ్రీజీ ఫీల్‌ను తీసుకొచ్చింది. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కామెడీ ట్రాక్‌ను భలే హ్యాండిల్ చేశారు కానీ, డ్రామా విభాగంలో ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది.
కానీ ఫ్రెండ్షిప్, గ్యాంగ్ కామెడీ, సిట్యువేషనల్ ఫన్‌తో టైమ్‌పాస్ చేయిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని నెమ్మదితనం, బలహీనమైన ఎమోషనల్ ట్రాక్ కొంత నిరాశపరిచినా, సెకండాఫ్‌లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, క్లైమాక్స్ సినిమాను నిలబెడతాయి. సుమంత్ ప్రభాస్, అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ కెమిస్ట్రీ ఈ సినిమాకు అసలైన 'రొమాంచకం'. లాజిక్‌ను పక్కనపెట్టి, ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చుని కాసేపు నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు
సినిమా పూర్తిగా'జాతి రత్నాలు' జోనర్‌లో సాగుతుంది. లాజిక్‌లు పక్కన పెట్టి చూస్తే, వచ్చే సీన్స్ మిమ్మల్ని హాయిగా నవ్విస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే కన్‌ఫ్యూజన్ డ్రామా సీన్లు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.
