CPL 2025: ఆకాశమే హద్దుగా RCB ప్లేయర్ బ్యాటింగ్.. ఒక్క లీగల్ డెలివరీకే 22 పరుగులు

CPL 2025: ఆకాశమే హద్దుగా RCB ప్లేయర్ బ్యాటింగ్.. ఒక్క లీగల్ డెలివరీకే 22 పరుగులు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్.. వెస్టిండీస్ క్రికెటర్ రొమారియో షెఫర్డ్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ తో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో షెపర్డ్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక బంతికే 22 పరుగులు రాబట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక బంతికి 10 లేదా ఎప్పుడైనా 15 పరుగులు రావడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ షెపర్డ్ మాత్రం ఏకంగా ఒక లీగల్ డెలివరీకి 22 పరుగులు బాదాడు. 

గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న షెపర్డ్.. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ ఓషేన్ థామస్ బౌలింగ్ లో తన ఊర మాస్ బ్యాటింగ్ తో ఈ ఘనతను అందుకున్నాడు. గయానా మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 15 ఓవర్ మూడో బంతికి ఈ వింత చోటు చేసుకుంది. తొలి రెండు బంతుల్లో 4 పరుగులిచ్చిన థామస్.. మూడో బంతి పూర్తి చేయడానికి ఆపసోపాలు పడ్డాడు. మొదట నో బాల్ వేయడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఆ తర్వాత ఒత్తిడిలో వైడ్ వేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు నో బాల్స్ వేయగా షెపర్డ్ రెండిటిని సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత వేసిన లీగల్ డెలివరీకి సిక్సర్ కొట్టాడు. 

►ALSO READ | 2030 Commonwealth Games: అహ్మదాబాద్‌‌లో కామన్వెల్త్ గేమ్స్.. బిడ్ దాఖలుకు మంత్రివర్గం ఆమోదం

ఓవరాల్ గా మూడు నో బాల్స్, ఒక వైడ్, మూడు సిక్సర్లతో ఈ బంతికి ఏకంగా 22 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో ఓవరాల్ గా 33 పరుగులు వచ్చాయి. రొమారియో షెఫర్డ్ ఈ మ్యాచ్ లో 34 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఛేజింగ్ లో  సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి విజయం సాధించింది.