
హైదరాబాద్,వెలుగు: గంజాయి, డ్రగ్స్ సప్లయర్స్ రూట్ మార్చారు. పోలీసుల నిఘా పెరగడంతో పబ్‌లు ఉండే ఏరియాలను టార్గెట్ చేశారు. పాత కస్టమర్లతో కలిసి చైన్ సిస్టమ్‌లో దందా చేస్తున్నారు. మత్తుకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిన కొన్ని పబ్స్‌పై పోలీసుల ఫోకస్ లేకపోవడంతో దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. కొకైన్, చరస్, హెరాయిన్, మెఫెడ్రోన్, గంజాయి లిక్విడ్ హాష్ ఆయిల్‌ను సప్లయ్ చేస్తున్నారు. ఆన్ లైన్లో ఆర్డర్ తీసుకుని పబ్స్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో రోడ్డు పక్కనే డ్రగ్స్ దందాను నడుపుతున్నారు. ఇలాంటి గ్యాంగ్స్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్స్‌తో దాడులకు ప్లాన్ చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో సుమారు 35 పబ్స్ యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. వీటిల్లో వీకెండ్ పార్టీలు, బర్త్‌డే సెలబ్రేషన్స్, బిజినెస్ డీల్స్ జరుగుతుంటాయి. ఇలాంటి సెలబ్రేషన్స్‌ను డ్రగ్స్ మాఫియా అడ్డాగా చేసుకుంది. పబ్స్ కస్టమర్లను టార్గెట్ చేసి డ్రగ్స్ సప్లయ్ చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నం.1లోని ఓ పబ్ ఏరియాలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్ డ్యానియల్ ఒలమైడ్‌ను ఈ నెల 2న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గరి నుంచి 4 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అతడి వాట్సాప్ నుంచి కస్టమర్ల డేటా కలెక్ట్ చేశారు.
కోడ్ లాంగ్వేజ్‌తో లోకేషన్ షేరింగ్
పబ్స్ సమీపంలోని బస్తీలు, ఫుట్‌పాత్‌లపై డ్రగ్ సప్లయర్స్ తిరుగుతున్నారు. తమ నెట్‌వర్క్‌లోని పాత కస్టమర్లతో చైన్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. కొత్త కస్టమర్లను జాయిన్ చేసిన వారికి కమీషన్స్ ఇస్తున్నారు. వాట్సాప్ కాలింగ్స్‌తో ఆర్డర్స్ తీసుకుంటున్నారు. సింగిల్ లెటర్‌తో డ్రగ్ డిటెయిల్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. కోడ్ లాంగ్వేజ్‌తో తమ లొకేషన్ ను కస్టమర్లకు వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. ఇలా పబ్స్‌కి వచ్చే కస్టమర్లతో సప్లయర్స్ కాంటాక్ట్‌లో ఉంటున్నారు. ఇస్నాపూర్ లోని ఓ కెమికల్ కంపెనీ అడ్డా సాగుతున్న మెఫిడ్రిన్ డ్రగ్ దందాను మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాలుగు రోజుల క్రితం ట్రేస్ చేసిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లి న్యూ బాలాజీనగర్‌లో దాడులు చేసిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ తో మరో ముగ్గురిని అరెస్ట్ చేసి 5 కిలోల 5 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్యాబ్లెట్స్ తయారీలో వాడే మెఫెడ్రోన్ డ్రగ్ పౌడర్ ను ఇల్లీగల్‌గా పబ్‌లకు సప్లయ్ చేస్తున్నట్లు ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు విచారణలో పోలీసులతో చెప్పినట్లు సమాచారం.
6 కిలోల గంజాయి సీజ్.. 13 మంది అరెస్ట్
సైబరాబాద్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు చేపట్టిన పోలీసులు మంగళవారం ఒక్కరోజే గంజాయి అమ్ముతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. నిందితులపై 8 కేసులు నమోదు చేశారు.