IND vs ENG: అశ్విన్,జడేజా అదుర్స్.. మొదటి సెషన్‌లో మనోళ్లదే హవా

IND vs ENG: అశ్విన్,జడేజా అదుర్స్.. మొదటి సెషన్‌లో మనోళ్లదే హవా

భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి సెషన్ ముగిసింది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి సెషన్ ముగిసేసరికి 28 ఓవర్లలో ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజ్ లో స్టార్ ఆటగాడు రూట్(18), బెయిర్ స్టో(32) ఉన్నారు. బెన్ డకెట్ 35 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. జాక్ క్రాలి (20), పోప్(1) విఫలమయ్యారు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పేస్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా లను ధీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో కేవలం 11 ఓవర్లోనే ప్రత్యర్థి జట్టు వికెట్ కోల్పోకుండా  53 పరుగులు చేసింది. ఈ దశలో స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇంగ్లండ్ జట్టుకు తమ స్పిన్ మాయాజాలాన్ని చూపించారు. 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టుకు కష్టాల్లోకి నెట్టారు.

ఈ దశలో సీనియర్ ప్లేయర్లు రూట్, బెయిర్ స్టో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. నాలుగో వికెట్ కు అజేయంగా 48 పరుగులు జోడించి లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత బౌలర్లలో అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది.