
- కౌలు రైతుల కోసం కొత్త చట్టం తేవాలి.. రైతు వేదిక సమావేశం
- రైతు స్వరాజ్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
- వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్న కేసీఆర్: ఆకునూరి మురళి
ముషీరాబాద్, వెలుగు: మారుతున్న కౌలు స్వభావానికి అనుగుణంగా కౌలు రైతుల హక్కులను మరింత పటిష్ట పరుస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కౌలు రైతుల పరిస్థితిపై రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించినప్పుడు ప్రాజెక్టు పరిధిలో భూమికి పరిహారంగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర భూ సర్వే నిర్వహించి భూ వివాదాలను పరిష్కరించాలని, గరిష్ట పరిమితికి మించి ఉన్న భూమిని జప్తు చేసి భూమి లేని వ్యవసాయదారులకు ఇవ్వాలన్నారు. సాగు చేయని వారు భూములు కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించే చట్టాన్ని తీసుకురావాలన్నారు.
కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆర్థిక హామీ ఇచ్చేలా రుణ హామీ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేసినట్లే వ్యవసాయాన్ని ధ్వంసం చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. 20, 30 ఏండ్ల కింద అమెరికా వెళ్లి, అక్కడ సీఈవోలుగా ఉంటూ అక్కడే సెటిల్ అయిన వాళ్ల అకౌంట్లలోకి రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా కొన్ని లక్షల రూపాయలు వేస్తోందన్నారు. గ్రామాల్లో నిజంగా వ్యవసాయం చేసే 22 లక్షల మంది పేద కౌలు రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయట్లేదన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఏకే 47 లు పట్టుకొని ప్రగతి భవన్కు పోవాలని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీజేఎస్పార్టీ చీఫ్ కోదండరాం, మాజీ ఐఏఎస్ గోపాల్ రావుతదితరులు పాల్గొన్నారు.