
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నాడో సినీ కవి. కానీ..సిక్స్ కొట్టాలంటే..విండీస్ క్రికెటర్లే కొట్టాలంటున్నారు క్రికెట్ అభిమానులు. విండీస్ క్రికెట్ కొట్టే సిక్సులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. వారు సిక్సులను శ్రద్ధగా కొడతారు. అందుకే అవి ఏకంగా స్టేడియం అవతల పడిపోతాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్లో విండీస్ బ్యాట్స్మన్ పావెల్ కొట్టిన సిక్స్..స్టేడియం అవతలపడింది. టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో విండీస్ వీరుడు పావెల్..భారీ సిక్సర్ బాదాడు.
వామ్మో 104 మీటర్ల సిక్స్
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ ..20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పావెల్ కొట్టిన సిక్స్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. చివరి ఓవర్ లో మూడో బంతిని జింబాబ్వే బౌలర్ ముజరబాని రొవ్‌మెన్ పొవెల్ శరీరాన్ని టార్గెట్‌గా చేసుకుని షార్ట్ బాల్‌గా సంధించాడు. గంటకి 137 కిమీ వేగంతో దూసుకొచ్చిన బంతిని రొవ్‌మెన్ పావెల్ చిన్నపాటి పాదాల కదలికతో బంతిని బలంగా ఫుల్ చేశాడు. బాల్కు బ్యాట్ కరెక్ట్గా కనెక్ట్ అవడంతో...అది కాస్తా సిక్స్గా వెళ్లింది. సిక్స్ అంటే మామూలు సిక్స్ కాదు.. 104 మీటర్లు దూరం వెళ్లి స్టేడియం వెలుపల పడింది.