
దర్శక ధీరుడు రాజమౌళి చెప్పినట్టు కాలం గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాట ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్ కాగా.. ఈ పాటను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు అందుకున్నారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తాజాగా మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. 'ఫ్యాన్ ఫేవరేట్ మూవీ' విభాగంలో 'గోల్డెన్ టొమాటో అవార్డు'ను సొంతం చేసుకుంది.
ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ అఫిషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా మేకర్స్ తెలియజేశారు. సినీ అభిమానుల ఓటు ఆధారంగా.. అమెరికాకు చెందిన రోటెన్ టొమాటోస్ వెబ్‌సైట్ ప్రతి ఏడాదీ ఈ అవార్డులు ప్రకటిస్తుంటుంది. అందులో భాగంగా 2022కుగాను ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎంపికైంది. ఉత్తమ చిత్రాలుగా నామినేషన్ దక్కించుకుని 2023 ఆస్కార్ బరిలో నిలిచిన ‘టాప్‌గన్: మావరిక్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లను వెనక్కి నెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్’ నంబరు 1గా నిలవడంపై భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హర్షం వ్యక్తమవుతోంది.