- మంత్రి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన బిల్డర్స్ అసోసియేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పరిధిలో 2020 నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రూ.10 లక్షల్లోపు పనులకు సంబంధించిన బిల్లులు రూ.100 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గ్రామాలు, మండలాలు, పట్ణణాల్లో రోడ్ల మెయింటెనెన్స్ కోసం చేసిన పనులు, ఇతర వర్క్‌లకు సంబంధించి 3,610 బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో విడుదల చేస్తామని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల విడుదలతో ఊరట లభించింది. పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు పాల్గొనాలి: మంత్రి వెంకట్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ పథకంలో భాగంగా రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రోడ్లకు సంబంధించిన టెండర్లను శనివారం పిలవనున్నట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మొత్తం 32 జిల్లాల పరిధిలో 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ టెండర్లలో రాష్ట్రంలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చన్నారు.
2026లో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభమవుతాయని, ఈ రోడ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే రెండేండ్లలో దేశానికే రోల్ మోడల్‌గా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం జరగనుందని చెప్పారు. అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
