ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ తో రూ.1,100 కోట్లు కొట్టేసిన్రు

ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ తో రూ.1,100 కోట్లు కొట్టేసిన్రు

హైదరాబాద్‌, వెలుగు: ఆన్‌లైన్‌ గేమ్స్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. చైనా దేశస్తుడితో పాటు మరో ముగ్గురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ ‌చేశారు. నిందితుల నుంచి 3 ల్యాప్ ‌టాప్స్‌, 6 సెల్‌ఫోన్స్‌, రబ్బర్ స్టాంపులు, డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రూ.30 కోట్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా గేమింగ్ బెట్టింగ్ లో దేశ వ్యాప్తంగా రూ.1,100 కోట్లు దోచుకున్నట్లు గుర్తించారు. ఈ కేసు వివరాలను ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. చైనాకు చెందిన 8 ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు ఢిల్లీ కేంద్రంగా బ్రాంచ్ ఓపెన్ చేశాయి. ఇందుకోసం యాహవో (28) ను సౌత్‌ ఈస్ట్ ‌ఆసియా అధికార ప్రతినిధిగా నియమించాయి. గ్రోయింగ్‌ ఇన్ఫోటెక్‌, సిలీ కన్సల్టిం గ్ సర్వీసెస్, పాన్‌ యన్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, లింక్యూన్‌ టెక్ , డొకిపే, స్పాట్‌పే, డైసిలింక్‌, హుహౌ పేర్లతో ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలను రిజిస్టర్ చేయించాయి. వీటికి గుర్గావ్ కు చెందిన ధీరజ్‌ సర్కార్‌(30), ఢిల్లీకి చెందిన అంకిత్‌ కపూర్‌(32), నీరజ్‌ తులి(34)లను డైరెక్టర్లుగా నియమించాయి.
చైనా నుంచే ఆపరేషన్స్..
ఈ ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్లఆపరేషన్స్ మొత్తం చైనా నుంచే జరుగుతున్నాయి. మన దేశం సహా ప్రపంచంలోని యూత్ ను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నాయి. మనీ ట్రాన్సెక్షన్స్ కోసం క్యాష్ ఫ్రీ గేట్ వేలను ఉపయోగిస్తున్నాయి. చైనాలోని బీజింగ్ టీ పవర్‌ కంపెనీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ క్యాష్‌ ట్రాన్స‌క్షన్లను కంట్రోల్ ‌చేస్తోంది.
టెలిగ్రామ్‌తో ట్రాప్‌..
టెలిగ్రామ్‌ గ్రూప్‌లోని వారికి గేమింగ్‌ లింక్స్‌ పంపిస్తున్నారు. మెంబర్‌గా చేరేందుకు కమీషన్స్‌ ఆశ చూపుతున్నారు. ఇలా చైన్‌ సిస్టమ్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారిని ఆన్‌లైన్‌ గేమ్స్ లో బెట్టింగ్‌ పెట్టిస్తున్నారు. రెడ్ , గ్రీన్‌, ఆరెంజ్‌.. ఇలా ఒక్కో గేమ్‌కి ఒక్కో కలర్‌ ఫిక్స్ చేసి కోడింగ్‌ ఇస్తున్నారు. రూ.10 నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ పెట్టిస్తున్నారు. గేమింగ్‌ సైట్లను ప్రతిరోజు ఛేంజ్‌ చేస్తుంటారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఒకరోజు కనిపించే కలర్‌ కోడ్ గేమ్ నెక్ట్స్ డే కనిపించదు. ఇలా ‘‘కలర్‌ ప్రిడిక్షన్‌” పేరుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదుతో…
ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ లో రూ.97 వేలు, రూ.1.64 లక్షలు పోగొట్టుకున్నామని ఇద్దరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా 10 కంపెనీల ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, మన దేశంలో జనవరి నుంచి సుమారు రూ.1,100 కోట్ల ట్రాన్స క్షన్స్ చేసినట్లు గుర్తించారు. ఈ మొతం గుర్గావ్ లోని హెచ్ ఎస్ బీసీ బ్యాంకులో డిపాజిట్ అయినట్లు తేలింది. బ్యాంకులో ప్రస్తుతమున్నరూ.30 కోట్లను పోలీసులు సీజ్‌ చేశారు. ఓవర్ ‌‌సీస్ ‌బ్యాంకుల్లో రూ.110 కోట్లకు పైగా బెట్టింగ్‌ ట్రాన్ క్షన్స్‌ జరిగినట్లు గుర్తించారు. కెమ్యాన్‌ ఐల్యాండ్స్ పేరుతో మరికొన్ని గ్రూప్స్ ‌క్రియేట్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం