
- రూ.120 కోట్లతో చేప పిల్లల పంపిణీ: మంత్రి పొన్నం ప్రభాకర్
ట్యాంక్ బండ్, వెలుగు: గీత వృత్తి బతకాలంటే చెట్లు పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో చేపల వృత్తి బతకాలంటే చెరువులు, కుంటల్లో చేప పిల్లలు పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ గంగా తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్ బండ్ హెచ్ఎండీఎ గ్రౌండ్‌లో తెలంగాణ గంగా తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గంగమ్మ ఆశీస్సులు ఉండాలని, మేఘాలు బద్దలై క్లౌడ్ బరస్ట్ జరిగి, భారీగా వర్షం పడుతుందన్నారు. లోయర్ మానేరు డ్యామ్ లోపల గంగమ్మ గుడి కట్టుకున్నామని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈ శాఖకు మంత్రి లేకపోవడంతో గతేడాది చేప పిల్లల పంపిణీలో ఇబ్బంది వచ్చిందని, ఈసారి ప్రత్యేకంగా ఈ శాఖకు మంత్రి ఉన్నారని తెలిపారు.
ఈసారి రూ.120 కోట్లతో చేప పిల్లలను పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి వర్షాలతో పంటలు పండుతున్నాయని అమ్మవారికి పూజలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా
జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.