
- రంగారెడ్డి జిల్లాలో రూ.127 కోట్ల బకాయిలు
- నోటీసులివ్వడానికి విద్యుత్ శాఖ రెడీ
- ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే నోటీసులు
రంగారెడ్డి జిల్లాలోని 560 పంచాయతీల్లో రూ.127 కోట్ల విద్యుత్ బిల్లు బకాయిలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం చెల్లిస్తుందా..? పంచాయతీలే తీర్చాలా అన్నదానిపై స్పష్టత లేక సర్పంచులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు బకాయిల వివరాలు సేకరించి నోటీసులిచ్చేందుకు విద్యుత్‌శాఖ రెడీ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా, వెలుగు: పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ కార్యాచరణ రూపోందిస్తోంది. బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ప్రభుత్వ సంస్థలు బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే పంచాయతీలు చెల్లించాల్సిన బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో కొత్తగా ఏర్పడిన గ్రామాలు 191 కాగా, మిగిలిన 369 పాత గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో రూ.127 కోట్ల విద్యుత్ బకాయిలున్నాయి. వాస్తవానికి రూ.128,09,56,346 కోట్ల బకాయిలు చెల్లించాలి. అయితే రూ.1,02,26,248 మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.127,07,30,098 మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. అయితే ఈ బకాయి ప్రభుత్వం భరిస్తోందా లేక పంచాయతీ పాలక వర్గాలు చెల్లించాలా అనే అనుమానాలు కొత్త సర్పంచులను వేధిస్తోంది. ఈ బకాయిల్లో అత్యధికంగా మహేశ్వరం, చేవెళ్ల మండలాల్లోని పంచాయతీలవే ఉండటం విశేషం. ఇప్పటికే విద్యుత్ అధికారులు పెండింగ్ విద్యుత్ బిల్లులున్న పంచాయతీలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోనైనా వసూలు చేయాలని, అవసరమైతే రెవె న్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించాలని విద్యుత్‌శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
చెల్లింపులు ఎలా
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కరెంట్ బిల్లు కట్టకుంటే వేటు తప్పదని స్వయంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే.. గ్రామాల్లో సర్పంచి, గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదని సూచించారు. కానీ బకాయిలు చెల్లింపులు ఎలా అని పాలక వర్గాల సభ్యులు, అధికారులు ఆలోచనలో పడ్డారు. జులై చివరి వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. అయినప్పటికీ పంచాయతీ, మున్సిపాలిటీల్లోని విద్యుత్ బకాయిలపై నివేదిక రూపొందిస్తున్నారు. దీంతో పాలక వర్గ ప్రజాప్రతినిధులు, అధికారుల ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ విద్యుత్ బకాయి చెల్లించాల్సి వస్తే పరిస్థితి ఏమిటని తలలు పట్టుకుంటున్నారు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు సిబ్బంది జీతాలు, నిర్వహణకే సరిపోతుంది. కానీ బిల్లుల చెల్లింపు కష్టంగా ఉంటుందని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు మండలాల్లో రూ.10 కోట్లకుపైగా..
జిల్లాలోని 21 మండలాల్లో 2 మండలాల్లో రూ.10 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలున్నాయి. మహేశ్వరం మండలంలోని పంచాయతీలు రూ.14,95,25,206 బకాయి ఉండగా, చేవెళ్ల మండలంలోని పంచాయతీలకు 10,82,11,794 బకాయిలుండటం విశేషం. వీటితో పాటు ఫరూక్‌నగర్ మండలంలోని గ్రామాల్లో రూ. 9,94,75,556, కొత్తూరు మండలంలోని గ్రామాల్లో రూ.9,94,44,789, మాడ్గుల మండలంలోని గ్రామాల్లో రూ. 9,28,01,127, మొయినాబాద్ మండలంలోని గ్రామాల్లో రూ. 9,95,89,630 చొప్పున బకాయిలు పేరుకుపోయాయి.
కొంత చెల్లించిన మండలాలు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో విద్యుత్ బకాయిలు రూ.5,45,61,480 పేరుకుపోగా అందులో రూ. 50,62,284లు చెల్లించింది. అదేవిధంగా ఫరూక్‌నగర్ మండలంలో రూ.9,95,46,151 బకాయిలు పేరుకు పోగా రూ.70,595 చెల్లించింది. ఇబ్రహీంపట్నలో రూ.1,26,54,365 బకాయిలుండగా రూ. 50,22,996, కొత్తూరు మండలంలో రూ.9,95,14,789 బకాయి ఉండగా రూ. 70 వేలు, తలకొండపల్లి మండలంలో రూ. 6,87,57,668 బకాయి ఉండగా, రూ. 373లు చెల్లించాయి. మిగతా బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది.
విద్యుత్ శాఖకు ప్రయోజనం
పురపాలక సంఘాలు, పంచాయతీ కార్యాలయాలకు కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలున్నాయి. వీటిని చెల్లించాలంటూ పలుమార్లు ఆయా కార్యాలయాలకు నోటీసులు జారీ చేసినా.. స్పందన లేదు. పురపాలక సంఘాలు, పంచాయతీ కార్యాలయాల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తే విద్యుత్ శాఖకు ఎంతో ప్రయోజనకరం. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర్వులు మంజూరు కావాల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చే వరకూ ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని పంచాయతీలకు సూచించాము.- మురళీకృష్ణ, రాజేంద్రనగర్ సర్కిల్ ఎస్‌ఈ