- ఇంటికి రూ.15 వేలు సాయం
- 15 జిల్లాఇంటికి రూ.15 వేలు సాయం ల్లో ఇండ్లు దెబ్బతిన్నవారి కోసం రూ.12.99 కోట్లు విడుదల
- ఉమ్మడి వరంగల్ లోని 4 జిల్లాల్లో 8,080 ఇండ్లు
- ఓరుగల్లుకే రూ.12 కోట్ల 12 లక్షల వరద నిధులు
- గ్రేటర్ వరంగల్లో అత్యధికంగా 6,475 ఇండ్లకు రూ.9 కోట్ల 71 లక్షల పరిహారం
- 11 రోజుల్లోనే నష్టపరిహారం రిలీజ్ చేసిన సీఎం రేవంత్‍రెడ్డి
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మొంథా తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. వరదల్లో ఇండ్లు డ్యామేజీ, ఉప్పుపప్పులు, వస్తువులు కోల్పోయిన బాధితుల ఇంటికి రూ.15 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు నిధులు కేటాయించింది. మొత్తం 15 జిల్లాల్లో ఈ తరహా బాధితుల కోసం రూ.12 కోట్ల 99 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 4 జిల్లాలకే అత్యధికంగా రూ.12 కోట్ల 12 లక్షలు ఇచ్చారు. గతంలో 2020–22 మధ్యలో రెండు, మూడుసార్లు వర్షాల కారణంగా వరంగల్ కాలనీల్లో వేలాది ఇండ్లు మునిగి గ్రేటర్ జనాలు నిరాశ్రులయ్యారు. అప్పటి బీఆర్‍ఎస్ పెద్దలు నగరంలో పర్యటించి హామీలు ఇచ్చారు తప్పితే నిధులు మాత్రం ఇవ్వలేదు. కాగా, మొంథా తుఫాన్ బాధితుల పరామర్శకు అక్టోబర్ 31న వరంగల్ సిటీకి వచ్చిన సీఎం రేవంత్‍రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కేవలం 11 రోజుల్లో నిధులు విడుదల చేశారు.
వరదలో మునిగిన సిటీ..
అక్టోబర్ 29న మొంథా తుఫాన్ ప్రధానంగా ఉమ్మడి వరంగల్ అందులోనూ ట్రైసిటీపై ఎక్కువ ప్రభావం చూపింది. ఆ రోజు కురిసిన వానకు మర్నాడు తెల్లవారుజాము నుంచి చెరువులు నిండుతూ వచ్చిన వరద వరంగల్ నగరాన్ని ముంచెత్తింది. దాదాపు 30 కాలనీలు మునగగా, గోపాల్‍పూర్‍లోని ఊర చెరువు పొంగడంతో దాదాపు 20 కాలనీల్లో ఇండ్లలోనికి వరద చేరి జనాలు రోడ్డున పడ్డారు. బియ్యం, ఉప్పపప్పులతోపాటు టీవీలు, కూలర్లు, మంచాలు, బట్టలు వంటి వస్తువులు నష్టపోయారు.
11 రోజుల్లోనే సాయం విడుదల..
వరదలతో అతలాకుతలమైన హుస్నాబాద్లోపాటు ఎక్కువ నష్టం జరిగిన వరంగల్ సిటీలో సీఎం రేవంత్‍రెడ్డి పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లోని సమ్మయ్య నగర్, కాపువాడ, పోతన నగర్, హంటర్‍రోడ్ కాలనీల్లో తిరిగి బాధితులకు ధైర్యం చెప్పారు. ఆపై హనుమకొండ కలెక్టరేట్‍లో మొంథా ప్రభావ జిల్లాల కలెక్టర్లు, ఉన్నాతాధికారులతో రివ్యూ నిర్వహించారు. గత ప్రభుత్వాల మాదిరి మాట తప్పకుండా ఎట్టిపరిస్థితుల్లో వరదల్లో దెబ్బతిన్న ఇండ్లవాసులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఒక్కో ఇంటికి రూ.15 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. 11 రోజుల్లోనే వాటికి అవసరమైన రూ.12.99 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రేటర్ లోనే 6,475 వేల మంది బాధితులు..
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో 16 జిల్లాల్లో ఎక్కువగా ఉండగా, 15 జిల్లాల్లో ఇండ్లకు నష్టం జరిగింది. కాగా, అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 8,662 ఇండ్లు దెబ్బతిన్నాయనే నివేదికల ఆధారంగా ఒక్కో ఇంటికి రూ.15 వేల చొప్పున రూ.12 కోట్ల 99 లక్షలు విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా ఓరుగల్లు, అందులోనూ గ్రేటర్ పరిధిలోనే నష్టం ఎక్కువగా ఉంది. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్తో కలిసి గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్ బాధితుల రిపోర్టు సిద్ధంచేసి ప్రభుత్వానికి అందించారు. గ్రేటర్ వరంగల్లో 6475 ఇండ్లు దెబ్బతిన్న నేపథ్యంలో అధికంగా రూ.9 కోట్ల 71 లక్షల 25 వేలను కేటాయించింది. ఇవేగాక హనుమకొండ రూరల్ మండలాల పరిధిలో 1,278 ఇండ్లు, వరంగల్ రూరల్ పరిధిలో 306 ఇండ్లు, మహబూబాద్ జిల్లాలో 16, ములుగు జిల్లాలో 5 ఇండ్ల చొప్పున వరద బాధితులకు పరిహారం అందజేస్తున్నారు.
హ్యాండిచ్చిన గత ప్రభుత్వం..
బీఆర్‍ఎస్ హయాంలో 2020, 2021, 2022లో వరుసగా ఏటా వర్షాకాలంలో వరంగల్ నగరం నీటమునిగింది. 2020 ఆగస్టులో కురిసిన వర్షాలు మాత్రం హైదరాబాద్‍తోపాటు వరంగల్ నగరంలోని ఎక్కువ కాలనీలను వణికించింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ లో పర్యటించి, ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారు. హైదరాబాద్ లోనూ పర్యటించిన ఆయన అక్కడ మాత్రం వరద బాధితులకు ఒక్కో ఇంటికి రూ.10 వేలు ప్రకటించి, వరంగల్ నగరాన్ని మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ విషయంలో నగరవాసులు తమకు సైతం పరిహారమివ్వాలని ధర్నాలు చేసినా పట్టించుకోలేదు.
