
- ఎకో, మెడికల్, హెల్త్, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నం
- ‘టూరిజం కాంక్లేవ్’లో సీఎం రేవంత్రెడ్డి పిలుపు
- హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ..
- యుద్ధం జరుగుతున్నా ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించాం
- అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో టూరిజం రంగానికి పెద్ద పీట వేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘హైదరాబాద్ సిటీ విశ్వనగరాలతో పోటీపడుతున్నది.. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి.. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. లాభాలు అందించే బాధ్యత కూడా తీసుకుంటుంది’’ అని పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్ సమీపంలోని శిల్పారామంలో ‘టూరిజం కాంక్లేవ్’ నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించగా.. ఆయా సంస్థల ప్రతినిధులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డితో కలిసి అవార్డులను ముఖ్యమంత్రి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఏర్పడి పదేండ్లయినా.. గత ప్రభుత్వం టూరిజం పాలసీ తీసుకురాలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజానికి ప్రత్యేక పాలసీ తీసుకొచ్చాం. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును అభినందిస్తున్న.. ఆయన టూరిజం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వివిధ దేశాల పాలసీలను స్టడీ చేసి తెలంగాణ టూరిజం పాలసీని తీసుకొచ్చారు” అని తెలిపారు.
సేఫెస్ట్ప్లేస్
తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయడంతోపాటు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, రామోజీ ఫిల్మింసిటీ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, యూనెస్కో రామప్ప టెంపుల్, వెయ్యి స్తంభాలగుడి, అలంపూర్ శక్తి పీఠాలు.. ఇలా అనేక టూరిజం ప్రాంతాలు ఉన్నాయని.. తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ఉందని తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్, మెడికల్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని వివరించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. యుద్ధం జరుగుతున్నా హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామని.. రక్షణ, శాంతి భద్రతల విషయంలో ఆలోచించాల్సిన పనిలేదని, తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ అని పేర్కొన్నారు.
పర్యాటకులకు స్వర్గసీమ తెలంగాణ: భట్టి
కృష్ణ, గోదావరి రెండు జీవనదుల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి తెలంగాణ అని, ఇక్కడో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, పర్యాటకులకు స్వర్గసీమ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పర్యాటక ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ తెలంగాణ రైజింగ్ నినాదంతో దూసుకెళ్తున్నదన్నారు.
తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు పెట్టుబడులు: జూపల్లి
తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త యుగం ప్రారంభమైందని, ప్రభుత్వం ప్రకటించిన పర్యాటక విధానం (2025–30)లో నిర్దేశించుకున్న రూ. 15 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యాన్ని మొదటి సంవత్సరంలోనే సాధించామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇది పెట్టుబడిదారులు తెలంగాణపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ తీర్థస్థలంగా అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంఐసీఈ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మూడు అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్లను, 10 వేల కొత్త హోటల్ గదులను ప్రణాళికలో పెట్టామని ఆయన వివరించారు.
15 వేల కోట్ల పెట్టుబడులు.. 50 వేల మందికి ఉపాధి..
టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ.15,279 కోట్ల పెట్టుబడులతోపాటు 50 వేల మందికి ఉపాధికి సంబంధించి పలు సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. మొత్తం 30 ప్రాజెక్టులు రూ.15,279 కోట్ల పెట్టుబడులు ప్రకటించాయి. వీటితో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 14 పీపీపీ ప్రాజెక్టులు (రూ7,081 కోట్లు), 16 ప్రైవేట్ రంగ ప్రాజెక్టులు (రూ.8,198 కోట్లు) ఉన్నాయి. ప్రాజెక్టుల్లో అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, మూడు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. మొదటి సారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్ కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్‌కి రానున్నాయి.