రూ. కోటి విలువైన 360 కిలోల గంజాయి సీజ్

రూ. కోటి విలువైన 360 కిలోల గంజాయి సీజ్
  • హైదరాబాద్‌ మీదుగా తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్‌, వెలుగు: రాజమండ్రి నుంచి యూపీకి గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ త్యాగి (29), అబ్రర్‌‌ (30), మహ్మద్‌ అమీరుద్దీన్‌ (32) ప్లంబరలు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుంచి ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌కి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ కారులో బుధవారం రాజమండ్రి వెళ్లారు. గంజాయి సప్లయర్‌‌ వద్ద 36‌‌0 కిలోల గంజాయి సేకరించారు. 5 కిలోల చొప్పున 72 ప్యాకెట్లు తయారు చేశారు. కారులోని సీక్రెట్ బాక్సుల్లో ప్యాక్ చేసి హైదరాబాద్ సిటీ మీదుగా మీరట్ కు బయలుదేరారు.   గంజాయి అక్రమ రవాణాపై ఎల్బీ నగర్‌‌ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో  ఎస్ఓటీ పోలీసులు అబ్దుల్లాపూర్​మెట్‌ పరిధి ఓఆర్‌‌ఆర్‌‌ సమీపంలో నిఘా పెట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా చేస్తున్న వెహికల్ ను అదుపులోకి తీసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రూ.కోటి విలువ చేసే 360 కిలోల గంజాయి, నిందితుల కారు స్వాధీనం చేసుకున్నారు.