మణుగూరు, వెలుగు: ఇండిగో ఎయిర్లైన్స్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగి కేఎస్ఎస్ సాగర్ బాబు తన భార్యతో కలిసి అమెరికా వెళ్లేందుకు ఇండిగో టికెట్ బుక్ చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ 27న హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా ప్యారిస్ కు చేరుకున్న తర్వాత అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకునే సమయంలో లగేజీ చార్జీలు చెల్లించలేదని అభ్యంతరం తెలిపారు. తాను లగేజీ చార్జి కింద రూ.24,261 చెల్లించానని రసీదు చూపించినా వినకపోవడంతో.. మరోసారి లగేజీ చార్జి చెల్లించాడు.
అమెరికా చేరుకున్న తర్వాత లగేజ్ అందకపోవడంతో అనేక సార్లు కంప్లైంట్ చేశాడు. లగేజ్ ఇవ్వకపోవడంతో పాటు లగేజ్ చార్జీలు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు ఖమ్మంలోని జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. వివరాలు పరిశీలించిన కమిషన్ ఇండిగో నిర్లక్ష్యం స్పష్టంగా ఉండడంతో సాగర్ బాబుకు రూ.2 లక్షల పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
