బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి.. భట్టి విక్రమార్కకి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి.. భట్టి విక్రమార్కకి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు: వచ్చే బడ్జెట్ లో  బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సెక్రటేరియెట్ లో  డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు.  సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్ కు  రూ. 4 వేల కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎంకు విన్నవించారు.  బీసీ బంధు పథకం ప్రవేశ పెట్టాలని తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్ కు 2 వేల కోట్లు..12 బీసీ కులాల ఫెడరేషన్లకు మరో 2 వేల కోట్లు కేటాయించాలని చెప్పారు.

ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ చదివే బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ధరల ప్రకారం కాలేజీలు, స్కూల్స్, హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలన్నారు. 2014కు ముందు బీసీలకు3.5 శాతం  బడ్జెట్ కేటాయించారని..కానీ బీఆర్ఎస్ హయంలో నిధులు తగ్గాయని గుర్తుచేశారు. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బీసీలకు 20 వేల కోట్లు కేటాయింపులు చేయాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.