కేరళంలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండటంతో ఆరోపణలు, ప్రత్యారోపణలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ అవినీతి గురించి దుమ్మెత్తి పోస్తున్న బీజేపీకి.. సొంత పార్టీ నేతలపై వస్తున్న అక్రమ ఆస్తుల వివాదం తలనొప్పిగా మారింది. లేటెస్టుగా కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ అక్రమాస్తులపై కాంగ్రెస్ ఆరోపణలతో రాష్ట్ర బీజేపీ ఇరకాటంలో పడింది.
కేరళ బీజేపీ చీఫ్ అక్రమాస్తులపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం (మార్చి 24) ఎక్స్ లో చేసిన పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్ లో బెంగళూరులో ఉన్న ప్యాలస్ గురించి పేర్కొనకుండా తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బెంగళూరులోని కోరమాంగళలో ఎకరాకు పైగా ఉన్న స్థలంలోని 49 వేల చదరపు ఫీట్ల ప్యాలస్ గురించి అఫిడవిట్లో మెన్షన్ చేయకపోవడంపై కాంగ్రెస్ విమర్శలకు దిగింది. దాదాపు 200 కోట్ల రూపాయల విలువ ఉండే భవంతి గురించి చెప్పకుండా తప్పుడు ఆధారాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్.
దీనికి తోడు ఆస్తి పన్ను చెల్లింపులపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. నామినేషన్ దాఖలు చేయడానికి కేవలం కొన్ని రోజుల ముందు, అంటే మార్చి 17న, కోరమంగళ 3వ బ్లాక్, నెం. 408గా నమోదైన ఆస్తిపై పన్ను చెల్లించారని ఆరోపించింది. దానికి సంబంధించిన రికార్డును ఎక్స్ లో పోస్ట్ చేసింది. చంద్రశేఖర్ 2024 అఫిడవిట్‌లో కూడా ఇదే చిరునామాను తన నివాసంగా పేర్కొన్నట్లు ఆ పార్టీ సూచించింది. కానీ లేటెస్టు అఫిడవిట్ లో ఇంటిని ప్రస్థావించకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని ఎత్తిచూపింది.
బీజేపీ చీఫ్ పదే పదే నేరాలు చేస్తున్నట్లు ఆరోపించిన కాంగ్రెస్ .. చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరింది. కేరళ ఎన్నికలు ఉన్న క్రమంలో బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ అఫిడవిట్ దాఖలు చేసిన మరుసటి రోజే వివాదం రాజుకోవడం గమనార్హం. కేరళలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీపీఎం (ఎం) నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి.శివన్ కుట్టీ, కాంగ్రెస్ నేత కేఎస్ శబరినాథన్ లపై ఆయన పోటీకి దిగుతున్నారు.
నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, తన మొత్తం ఆస్తులు రూ. 93 కోట్లకు పైగా ఉన్నాయని ప్రకటించారు.చరాస్తుల విలువ రూ. 78.81 కోట్లకు పైగా ఉండగా, ఆయన భార్య వద్ద రూ. 18.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు,ఇతర పెట్టుబడులు ఉన్నాయి.
చరాస్తులలో రూ. 3.58 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులతో పాటు, 1994లో కొనుగోలు చేసిన 1942 మోడల్ వింటేజ్ రెడ్ ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్ కూడా ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం, బెంగళూరులో స్వార్జిత ఆస్తితో సహా అతని స్థిరాస్తుల విలువ రూ. 15.07 కోట్లకు పైగా ఉంది. అలాగే, అతని అప్పులు రూ. 107 కోట్లకు పైగా ఉన్నాయని, అతని భార్యకు సుమారు రూ. 1.62 కోట్ల అప్పులు ఉన్నాయని కూడా వెల్లడించారు. చంద్రశేఖర్ 2024-25 సంవత్సరానికి రూ. 92.91 లక్షల ఆదాయాన్ని చూపగా, అతని భార్య రూ. 60.50 లక్షల ఆదాయాన్ని ప్రకటించారు.
ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన చంద్రశేఖర్ .. 2023 కలమస్సేరి పేలుడుకు హమాస్‌తో సంబంధం ఉందని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రెండు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే, ఆ కేసుల్లో బలవంతపు చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ ఆరోపణలపై చంద్రశేఖర్ గానీ, బీజేపీ గానీ వెంటనే స్పందించలేదు.
