ఫార్ములా రేస్​ అడ్డగోలు లాస్​.. రూ. 200 కోట్ల నష్టం

ఫార్ములా రేస్​ అడ్డగోలు లాస్​..   రూ. 200 కోట్ల నష్టం
  • కేబినెట్​ ఆమోదం లేకుండా.. ఎలక్షన్​ కోడ్​ పట్టించుకోకుండా ఒప్పందం
  • బీఆర్​ఎస్​ హయాంలో కథ నడిపిన స్పెషల్​ సీఎస్​ అర్వింద్​​ కుమార్!​
  • సీజన్​కు రూ. 200 కోట్ల నష్టం
  • ఫోన్ల మీదనే నడిచిన అగ్రిమెంట్​.. 
  • ఈ ఫిబ్రవరి సీజన్​కు అప్పట్లోనే  రూ.55 కోట్ల అడ్వాన్సు
  • అసలు విషయాన్ని గుర్తించి.. ఒప్పందాన్ని రద్దుచేసిన ప్రస్తుత సర్కార్​
  • రూ. 55 కోట్లు కట్టాలని అర్వింద్​కుమార్​కు  నోటీసులు!

హైదరాబాద్​, వెలుగు:  హైదరాబాద్​లో ఫార్ములా–ఈ కార్ల రేస్​ అగ్రిమెంట్​ వెనుక భారీ అవినీతి బాగోతం బయటపడింది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో కీ రోల్​లో ఉన్న ఉన్నతాధికారి అర్వింద్​కుమార్​ అడ్డదారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. కేబినెట్​ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు రూ.55 కోట్లు అడ్వాన్స్​గా ముట్టజెప్పినట్లు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్​ అమలులో ఉన్న టైమ్​లో!! కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారు. దీన్ని గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం.. రూ. 55 కోట్లు చెల్లించాలని అర్వింద్​కుమార్​కు నోటీసు జారీ చేసినట్లు సమాచారం. 

అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్​బండ్​ చుట్టూ ఐమాక్స్​ సమీపంలో గత ఏడాది కార్ల రేసింగ్ (ఫార్ములా రేస్​ సీజన్​ ఈవెంట్​9)​ను నిర్వహించారు. దీని వల్ల హైదరాబాద్​ జనం నానా తిప్పలు పడ్డారు. అప్పుడు రేసింగ్​ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్​ఎండీఏ రూ.20 కోట్లు, రేస్​కు ప్రమోటర్​గా ఉన్న నెక్స్ట్ జెన్​ అనే ప్రైవేట్​ ఏజెన్సీ దాదాపు  రూ.150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్​తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్​ లైట్లు.. ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్​ 9 ఈవెంట్​ నిర్వహణకు హెచ్​ఎండీఏ, నెక్స్ట్ జెన్​, ఫార్ములా–ఈ  కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్​ 9 నిర్వహణ వల్ల హెచ్​ఎండీఏకు గానీ, నెక్ట్స్​ జెన్​ సంస్థకు గానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది. 

ప్రమోటర్​ లేకుండా.. చాటుమాటుగా అగ్రిమెంట్​

ఫార్ములా– ఈ రేస్​ సీజన్​ 9 వల్ల నష్టం వాటిల్లినట్లు తేలినా.. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్​ 10 నిర్వహణ కోసం నిరుడు అక్టోబర్​లో  బీఆర్​ఎస్​ హయాంలోనే పచ్చ జెండా ఊపారు.  కేబినెట్​ ఆమోదం లేకుండానే అప్పటి హెచ్​ఎండీఏ  కమిషనర్​,  స్పెషల్ సీఎస్​ అర్వింద్​ కుమార్​ అగ్రిమెంట్​పై సంతకాలు చేసినట్లు తేలింది. ప్రమోటర్ లేకుండా.. నేరుగా ఫార్ములా –ఈ కంపెనీతో హెచ్​ఎండీఏ  ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దీంతో రేసుకు పెట్టే ఖర్చు, వాటిల్లే నష్టం మొత్తం హెచ్​ఎండీఏపైనే ఉంటుంది. అంటే దాదాపు రూ.200 కోట్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అంతమేరకు ప్రజాధనం వృథా అవుతుందని తెలిసినా.. ఆ కంపెనీకి ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్​కు సంబంధించి రూ. 55 కోట్లు అడ్వాన్సుగా ముట్టజెప్పారు. 

ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం ఇతర కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు న్యాయ వివాదాలన్నీ రాష్ట్ర పరిధిలో ఉండే కోర్టుల్లో తేల్చుకోవాలనే నిబంధన విధించటం సర్వసాధారణం. కానీ.. ఈ –రేసింగ్​ అగ్రిమెంట్​లో వివాదాలను లండన్​ కోర్టులో తేల్చుకోవాలనే నిబంధన పొందుపరిచినట్లు తెలిసింది. -ఈ రేస్​ అగ్రిమెంట్​ అక్టోబర్​ చివరి వారంలో జరిగింది. ఆ టైమ్​లో రాష్ట్రంలో  ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈసీ అనుమతి తీసుకోకుండా.. కంపెనీ ప్రతినిధులు నేరుగా ఇక్కడికి రాకుండానే.. ఈ– మెయిల్​, ఫోన్ల ద్వారానే అర్వింద్​కుమార్​ ఈ తతంగం నడిపినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. 2024 ఫిబ్రవరి సీజన్​కు సంబంధించి మాత్రమే కాకుండా మరో రెండు సీజన్ల రేస్​లకు కూడా బీఆర్​ఎస్​ హయాంలోనే ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. ఫలితంగా మూడు సీజన్లకు సంబంధించి ఏటా రూ. 200 కోట్ల మేర దాదాపు 600 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే పరిస్థతి ఏర్పడింది. దీన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం.. చర్యలకు దిగింది. 

అసలు విషయం బయటకు రావడంతో..!

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ (సీజన్​ 10)​ను రద్దు చేసుకుంటున్నట్లు రెండ్రోజుల కిందట ఫార్ములా –ఈ సంస్థ ప్రకటించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ హెచ్​ఎండీఏకు నోటీసులిచ్చింది. దీంతో అసలేం జరిగిందని.. మున్సిపల్​ విభాగం ఆరా తీయటంతో అసలు కథ బయటకు వచ్చింది. రూల్స్​కు విరుద్ధంగా నిరుడు ఒప్పందం జరిగినట్లు, ప్రజాధనాన్ని వృథా చేసేలా ఈ అగ్రిమెంట్​ ఉన్నట్లు  తేలింది. వెంటనే అగ్రిమెంట్​ను రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్​ విభాగం నోటిఫికేషన్​ఇచ్చింది. అప్పటి హెచ్​ఎండీఏ కమిషనర్​ అర్వింద్​కుమార్​ రూల్స్​ను ఉల్లంఘించి.. వ్యక్తిగతంగా ఈ అగ్రిమెంట్​ చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రూ.55 కోట్లు చెల్లించాలని ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే అర్వింద్​కుమార్​ను డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ స్పెషల్​ సీఎస్​గా బదిలీ అయ్యారు.