
సికింద్రాబాద్, వెలుగు: ఓ క్రిమినల్ కేసులో భర్తను అరెస్టు చేయకుండా ఉండేందుకు భార్య దగ్గరి నుంచి రూ.20 వేలు లంచం తీసుకున్న బొల్లారం ఎస్సై, కానిస్టేబుల్ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..బొల్లారంకు చెందిన నర్సింగ్ రావు ఎంఆర్ ప్యాడ్ బ్యాండ్ వర్క్ వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం లేబర్ తో గొడవ కారణంగా బాధితుల కంప్లయింట్ మేరకు నర్సింగ్ రావుపై బొల్లారం పీఎస్ లో సీఆర్ నెం.17/2019,యు/బి 324 అండ్ 384 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదైంది. నర్సింగ్ రావు 10 రోజులుగా పరారీలో ఉండటంతో రోజూ అతడికి ఇంటికి పోలీసులు వచ్చి వెళ్తున్నారు.
నర్సింగ్ రావును అరెస్టు చేయకుండా ఉండాలంటే, స్టేషన్ బెయిల్ కు రూ.25వేలు లంచం ఇవ్వాలని లేదంటే అతడిపై నాన్ బెయిల్ కేసు నమోదు చేస్తామని ఎస్సై బ్రహచారి, కానిస్టేబుల్ ఎం. నాగేశ్ అతడి భార్య అంబికను డిమాండ్ చేశారు. రూ.20 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న ఆమె ఇంటి వద్ద రూ.10వేలు ఇచ్చి.. మరుసటి రోజు బ్యాంక్ అకౌంట్ లో రూ.10వేలు వేసింది. డబ్బులు ఇచ్చినా ఎస్సై, కానిస్టేబుల్ స్పదించకపోవడంతో అంబిక ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలతో సోమవారం బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై బ్రహ్మచారి, కానిస్టేబుల్ నాగేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.