
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గల్ఫ్ లో మరణించిన తెలంగాణ కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇటీవల సౌదీలో చనిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన బొడ్డు బాబు మూడు నెలల కిందట బైరన్లో చనిపోయాడు. వేములవాడ రూరల్ మండలం మర్రిపెల్లికి చెందిన శశికుమార్(28) డిసెంబర్లో సౌదీలో చనిపోయారు. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. ఆ కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అధికారులు విడుదల చేశారు.