
- ప్రశ్నార్థకంగా వీధి కుక్కలు, కోతుల బర్త్ కంట్రోల్
- వృథాగా రూ.50 లక్షలతో నిర్మించిన షెడ్
- పట్టించుకోని మున్సిపల్, పంశుసంవర్ధకశాఖ అధికారులు
నాగర్‌కర్నూల్, వెలుగు: వీధికుక్కలు, కోతుల బర్త్ కంట్రోల్ చేస్తామంటూ నాగర్‌కర్నూల్‌లో నాలుగేళ్ల కింద రూ.50 లక్షలతో నిర్మించిన ఎనిమల్ కేర్ సెంటర్ వృథాగా మారింది. షెడ్ లోపల నాలుగు రూములు, ఇనుప గ్రిల్స్‌తో కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌కు కుక్కలు, కోతులను తీసుకొచ్చి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తామని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆ తరువాత మున్సిపల్, పశు సంవర్ధకశాఖ అధికారులు ఎనిమల్ కేర్ సెంటర్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
షెడ్ నిర్మాణంతో సరిపెట్టిన్రు..
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో వీధి కుక్కలు, కోతల సంఖ్య పెరగకుండా బర్త్ కంట్రోల్ చేసేందుకు 2021లో పట్టణ ప్రగతి కింద అచ్చంపేట రోడ్డులో చంద్రాయిపల్లి సమీపంలో రూ.50 లక్షలతో ఎనిమల్ కేర్ సెంటర్ కోసం షెడ్‌ను నిర్మించారు. అప్పటి నేతల అనుచరులు పట్టణ ప్రగతి పనులను చేపట్టారు. ఇందులో జిల్లా కేంద్రంలోని కుక్కలు, కోతులను పట్టుకుని వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి వదిలేస్తామని ప్రకటించారు.
ఈక్రమంలో చేపట్టిన జంతుగణనలో జిల్లాలో 10 వేల వీధికుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 4 వేల కుక్కలు జిల్లా కేంద్రం, దాని పరిసరాల్లో ఉన్నట్లు తేలింది. మెయిన్ రోడ్లు, వీధుల్లోకి వెళ్లే రోడ్ల పక్కన డజన్ల సంఖ్యలో ఉండే కుక్కల దాడిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు గాయపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కుక్కలు, కోతుల మూకలు ఇండ్లు,షాపులు, ఆఫీసుల్లోకి దూరిపోతున్నాయి.
కుక్కలను పట్టుకోవడమే సమస్య..
కొన్ని సీజన్లలో హార్మోన్ల మార్పుతో వీధి కుక్కలు మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈక్రమంలో వీధి కుక్కల నియంత్రణ, వాటిని పట్టుకునే బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించారు. దీని కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలుస్తారు. కుక్కలను పట్టుకునే ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగుతారు. ఆ తరువాత వాటిని దూరంగా వదిలిపెడతారు.
అయితే జిల్లా కేంద్రంలో ఎనిమల్ కేర్ సెంటర్ నిర్మించిన తరువాత కూడా స్థానికులకు కుక్క కాట్లు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కుక్కలు, కోతులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.