రక్షణ శాఖకు కేంద్రం బూస్ట్.. సప్లిమెంటరీ బడ్జెట్​లో రూ.50 వేల కోట్లు కేటాయించే చాన్స్

రక్షణ శాఖకు కేంద్రం బూస్ట్.. సప్లిమెంటరీ బడ్జెట్​లో రూ.50 వేల కోట్లు కేటాయించే చాన్స్
  • రూ.7 లక్షల కోట్లకు చేరనున్న డిఫెన్స్ బడ్జెట్
  • మొత్తం బడ్జెట్​లో 13 శాతం నిధులు రక్షణ శాఖకే

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రక్షణ శాఖ బడ్జెట్​ను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచనున్నట్లు తెలిసింది. సప్లిమెంటరీ బడ్జెట్ లో భాగంగా సుమారు రూ.50 వేల కోట్లు అదనంగా కేటాయించనున్నట్టు సమాచారం. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. తాజా పెంపుతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు మొత్తం కేటాయింపులు రూ.7 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​లో డిఫెన్స్ మినిస్ట్రీకి రూ.6.81 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో  పోలిస్తే 2025–26లో ఓవరాల్​ డిఫెన్స్ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లకు (9.2 శాతం) చేరింది. 

మొత్తం బడ్జెట్​లో రక్షణ శాఖ 13.45 శాతం వాటా కలిగి ఉన్నది. తాజాగా పెంచనున్న బడ్జెట్​కు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అదనంగా కేటాయించిన నిధులతో రక్షణ శాఖకు అవసరమైన వెపన్స్, మందుగుండు సామాగ్రితో పాటు అత్యవసరమైన డిఫెన్స్ ఎక్విప్​మెంట్లను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2014–2015 ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.2.29 లక్షల కోట్లు కేటాయించింది. తాజాగా పెంచిన నిధులతో ఇప్పటి వరకు రక్షణ శాఖకు కేటాయించిన ఫండ్స్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 

చైనా, పాకిస్తాన్‌‌ నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణరంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్‌‌లో కేటాయింపులను పెంచింది. జీడీపీలో రక్షణ కేటాయింపులు 1.91 శాతంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరమ్ డోమ్ లాంటి అడ్వాన్స్డ్​  డిఫెన్స్ సిస్టమ్స్ తరహాలో టెక్నాలజీని డెవలప్ చేయాలని ఇండియా భావిస్తున్నది. ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్​తో పాటు దేశీయంగా తయారవుతున్న డిఫెన్స్ ఎక్విప్​మెంట్​ అప్​గ్రేడ్​పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.