సంకీర్తనకు రూ. 50 వేలు అందజేసిన సెక్రటేరియట్ ఉద్యోగులు

సంకీర్తనకు రూ. 50 వేలు అందజేసిన సెక్రటేరియట్ ఉద్యోగులు
  • ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేటీఆర్​
  • వెలుగు కథనానికి స్పందన

భైంసా,వెలుగు: నిర్మల్​జిల్లా కుభీర్​ మండలం సిర్పెల్లి (హెచ్​) గ్రామానికి చెందిన గాడేకర్​ సంకీర్తన అనే నిరుపేద దళిత విద్యార్థినికి సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. నీట్​లో ర్యాంకు సాధించి హైదరాబాద్​లోని మల్లారెడ్డి మెడికల్​కాలేజీలో సీటు సాధించిన సంకీర్తన ఫీజు కట్టలేని స్థితిలో ఉండడంతో వీ6 వెలుగులో ‘సరస్వతి కరుణించినా..లక్ష్మీ కటాక్షం కరువైంది’  హెడ్డింగ్​తో కథనం ప్రచురితమైంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దాతలు స్పందిస్తున్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్​ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రూ. 50 వేలను పోగు చేసింది. హెల్పింగ్​హ్యాండ్స్​సెక్రెటేరియట్​గ్రూప్​ద్వారా ఈ విరాళాలు సేకరించి గ్రూప్​ ప్రెసిడెంట్​తులసీదాస్​ గైక్వాడ్​చేతుల మీదుగా సంకీర్తనకు అందజేశారు. సభ్యులు శంకర్​ నాయక్​, ప్రశాంత్​, సోమన్న, కిశోర్, గంగాలక్ష్మి, భీం ప్రసాద్​పాల్గొన్నారు. 

ట్విటర్​లో పోస్ట్​కు కేటీఆర్​స్పందన 

సంకీర్తన దీన స్థితిపై వీ6 వెలుగులో వచ్చిన కథనాన్ని చూసిన స్ఫూర్తి అనే యువతి రెండు రోజుల కింద ట్విటర్​లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్​రెడ్డిలకు ట్యాగ్​చేశారు. దీంతో మంత్రి కేటీఆర్​స్పందించి రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటికే ఆయన పీఏ సంకీర్తనకు ఫోన్​చేసి అధైర్య పడొద్దని, చదువుకు సాయం చేసి ఆదుకుంటామని కేటీఆర్​చెప్పారని భరోసా ఇచ్చారు. అలాగే ఇప్పటివరకు పలువురు దాతలు సంకీర్తనకు సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం చేశారు.