పాపం రైతన్న: పంట అమ్మిన డబ్బంతా ఎలుకలు కొట్టేసినయ్

పాపం రైతన్న: పంట అమ్మిన డబ్బంతా ఎలుకలు కొట్టేసినయ్

రైతన్న ఆరుగాలం కష్టం ఎలుకల పాలైంది. ప్రకృతి కరుణిస్తే గానీ అన్నదాత నాలుగు గింజలు పండించ సాధ్యం కాదు. ఏ విపత్తులూ రాకుంటేనే అది నిలబెట్టుకోగలిగేది. తెగుళ్లు, చీడల బారి నుంచి కాపాడుకున్నా.. ఎలుకలు, పిట్టల బారిన పడకుండా కాచుకుంటేనే ఇన్ని గింజలు మిగిలేది.

ఎండా వానా లెక్కచేయక.. పగలు రాత్రి తేడా లేకుండా కష్టం చేస్తే ఆ పంట ఇంటికి చేరేది. అది మార్కెట్ కు తీసుకెళ్తే మద్దతు ధర దొరికేది మరో పెద్ద కష్టం. ఎలాగోలా బేరం చేసుకుని నాలుగు పైసలు చేతిలో పడితేనే ఆ రైతు గుండెల మీద చేతులేసుకుని పడుకుంటాడు. అంత రోజంతా మనసులో ఓ వైపు ఆ పంట గురించే ఆలోచనంతా!!

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెళియంగడు గ్రామంలో రంగరాజ్ అనే వృద్ధ రైతు ఇంతటి కష్టాన్ని ఎలుకలు మింగేసినయ్. ఆరుగాలం చెమటోడ్చి సంపాదించిన మొత్తం ఒక్క రాత్రిలో తునకలు చేసేశాయ్. పంట అమ్మి ఇంట్లో భద్రంగా ఓ సంచిలో దాచుకున్న 50 వేల రూపాయల సొమ్మును పొట్టనబెట్టుకున్నయ్.

ఇంట్లో సంచిలో ఉన్న డబ్బునంతా ఎలుకలు ముక్కలు ముక్కులు చేసేశాయని రంగరాజ్ చెప్పారు. ముక్కలైన ఆ డబ్బును స్థానిక బ్యాంకు కు తీసుకెళ్తే వాళ్తు తిప్పి పంపేశారని తన గోడు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బును ఎలా మార్చుకోవాలా అని తలబాదుకుంటున్నాడా రైతన్న.