బషీర్‌బాగ్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో సైబర్ చీటర్లు వ్యక్తులు ఓ యువకుడిని నిండా ముంచారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం... సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 32 ఏండ్ల యువకుడికి 2021లో ఒక బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి మెసేజ్ వచ్చింది. క్రికెట్, తీన్‌పత్తి, క్యాసినో వంటి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆ అందులో సూచించారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు మొదట రూ.10 వేలు డిపాజిట్ చేయగా, స్వల్ప లాభం వచ్చింది. నమ్మకం పెరిగి పలు దఫాలుగా రూ.10 లక్షల వరకు డిపాజిట్ చేయగా, ఆ డబ్బులు పోయాయి. బెట్టింగ్మానేసిన అతడిని 2022 మార్చిలో మరోసారి సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
తక్కువ డిపాజిట్‌తో మరో బెట్టింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలని ఒప్పించారు. వారి మాటలు నమ్మి 2021 నుంచి 2025 వరకు పలు బెట్టింగ్ వెబ్సైట్లలో మొత్తం రూ.75 లక్షలు వరకు కోల్పోయాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
