కాళేశ్వరానికి 75 వేల కోట్లు పెట్టినా మడి తడుస్తలే

కాళేశ్వరానికి 75 వేల కోట్లు పెట్టినా మడి తడుస్తలే
  • మూడో ఏడాదీ ఒక్క ఎకరం కూడా సాగైతలేదు
  • ఈ పునాసలో 39.35 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల నీళ్లు
  • అందులో ఎస్సారెస్పీదే పెద్దపాలు.. రెండో ప్లేస్‌‌‌‌లో నాగార్జునసాగర్‌‌‌‌
  • ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ యాక్షన్​ ప్లాన్​లో వెల్లడి 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వరుసగా మూడో ఏడాదీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వట్లేదు. రూ.75 వేల కోట్లు ఖర్చు చేసి కొండపోచమ్మ వరకు నీళ్లు ఎత్తి పోశామని గొప్పలు చెప్పుకునుడే తప్ప ప్రాజెక్టుతో ఒక్క మడిని కూడా తడుపుతలేరు. ఈ విషయాన్ని స్వయంగా ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంటే తేటతెల్లం చేసింది. డిపార్ట్​మెంట్​ తయారుచేసిన వానాకాలం యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌లో కాళేశ్వరం నీళ్ల ముచ్చట్నే లేదు. రాష్ట్రంలో ఈ పునాసలో 1.42 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా.. అందులో ప్రాజెక్టుల కింద నీళ్లిచ్చేది కేవలం 39.35 లక్షల ఎకరాలకే. అంటే మొత్తం సాగుభూమిలో పావు వంతుకు మాత్రమే ప్రాజెక్టుల నీళ్లు అందిస్తున్నారన్నమాట. దానిలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చుడు లేదు. కోటి ఎకరాలకు ఈ ఒక్క ప్రాజెక్టుతోనే నీళ్లిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకునుడు తప్ప.. ప్రాజెక్టును ప్రారంభించి మూడేండ్లవుతున్నా అతీగతీ లేదు. 

ఎస్సారెస్పీదే పెద్దపాలు
రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద సాగవుతున్న మొత్తం ఆయకట్టులో ఎస్సారెస్పీ ప్రాజెక్టుదే పెద్దపాలుగా ఉంది. ఎస్సారెస్పీ స్టేజీ -1లో ఎల్‌‌‌‌‌‌‌‌ఎండీకి ఎగువ, దిగువ ఆయకట్టు, దీనిపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు, ఎస్సారెస్పీ స్టేజీ-2 అన్ని కలుపుకొంటే పోచంపాడు నీళ్లతో 15 లక్షల ఎకరాలు సాగవనున్నాయి. దీని తర్వాత నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలువ ఆయకట్టు రెండో స్థానంలో ఉంది. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలువతో పాటు  సాగర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఏర్పాటు చేసిన ఏఎమ్మార్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్బీసీ ప్రాజెక్టు కింద 9.20 లక్షల ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక మెట్ట సాగు ఈ ఒక్క ప్రాజెక్టు కిందనే అవుతోంది. పాలమూరు ప్రాజెక్టుల కింద ఆరుతడి పంటల వాటానే ఎక్కువగా ఉంది. గోదావరిపై నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకం కింద కూడా ఎక్కువగా ఆరుతడి పంటలకే నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు.

యాసంగిలో 72,337 ఎకరాలు ప్రతిపాదించినా..
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నిరుడు యాసంగిలో 72,337 ఎకరాలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. చెరువుల కింద 36,499 ఎకరాలు, ప్రాజెక్టు కింద 35,838 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు 5.38 టీఎంసీలు వాడాలని నిర్ణయించారు. రంగనాయకసాగర్‌‌‌‌‌‌‌‌ కింద కొత్త ఆయకట్టు తేవాలని అనుకున్నా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కాక అది సాధ్యం కాలేదు. ఎండాకాలంలో కాల్వల భూసేకరణ పూర్తి చేసి వానాకాలంలో కనీసం 2.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నా.. అదీ సాధ్యం కాలేదు. దీంతో ఈ ఏడాది వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనే ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టారు.

ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన ప్రాజెక్టుల కిందనే..!
ప్రాజెక్టుల కింద వానాకాలం సాగునీటి విడుదలకు యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ సిద్ధం చేయడానికి జూన్‌‌‌‌ 16న ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ అధ్యక్షతన శివమ్‌‌‌‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌‌‌‌ ఇటీవల విడుదల చేశారు. 18 చీఫ్‌‌‌‌ ఇంజనీర్ల సర్కిల్స్‌‌‌‌ పరిధిలో 25,86,359 ఎకరాల్లో మెట్ట, 13,49,176  ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. మొత్తం  39.35 లక్షల ఎకరాల్లో పంట సాగుకు 378.27 టీఎంసీల నీళ్లు అవసరమని లెక్క తేల్చారు. ఈ మొత్తం ఆయకట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ప్రారంభించిన ప్రాజెక్టుల కిందనే ఉన్నది.