- పంచాయతీ ఎన్నికలకు పోలీసుల పటిష్ట బందోబస్తు
- 537 ఫ్లయింగ్ స్క్వాడ్, 155 స్టాటిక్ టీమ్స్‌తో తనిఖీలు
- భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు డీజీపీ శివధర్‌రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 537 ఫ్లయింగ్ స్క్వాడ్,155 స్టాటిక్ టీమ్స్‌తో తనిఖీలు చేస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రూ.8.20 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఓటర్లను ప్రలోభాలు గురిచేసేందుకు తరలిస్తున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం భద్రతా ఏర్పాట్లపై డీజీపీ ఆఫీస పత్రికా ప్రకటన విడుదల చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 229 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా.. 1,053 నాన్- బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేసినట్టు తెలిపింది. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లోని లైసెన్స్‌డ్ గన్స్‌ను డిపాజిట్ చేసుకున్నట్టు పేర్కొన్నది.
పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తు
గురువారం జరగనున్న తొలి దశ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా స్థానిక పోలీస్ ఉన్నతాధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సంబంధిత జిల్లాల ఎస్పీలతో బుధవారం సమీక్ష జరిపారు.
సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, చత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి వచ్చే 54 అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 537 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 155 స్టాటిక్ నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. నగదు, మద్యం, ఆయుధాలు, ఇతర సామగ్రి అక్రమ తరలింపును నిరోధించే క్రమంలో తనిఖీలు నిర్వహించారు.
3,800కుపైగా పంచాయతీలకు పోలింగ్ జరగనుండడంతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 3 వేల కంటే ఎక్కువ పంచాయతీల్లో పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యక్ష వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు వెంటనే జరుగుతుంది కాబట్టి, అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

