
బషీర్బాగ్, వెలుగు: మనీలాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్ట్ అంటూ ఓ ప్రభుత్వ మహిళ ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 4న బాధిత మహిళకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అంటూ ఓ కాల్ వచ్చింది. ఆమె వాడుతున్న మొబైల్ నంబర్ చట్టవిరుద్ద కార్యకలాపాలకు వాడుతున్నారని, మహారాష్ట్రలో కేసు నమోదు అయినట్లు తెలిపాడు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాను సంప్రదించాలని సూచించాడు. ఆ తర్వాత వెంటనే చీటర్లు ముంబై సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు అధికారిని అంటూ వీడియో కాల్ చేశారు.
ఆర్థిక నేరస్తుడు నరేశ్ గోయెల్ తో మనీలాండరింగ్ కేసులో బాధితురాలి ప్రమేయం ఉందని తెలిపారు. ఈ కేసు విషయం జాతీయ భద్రత దృష్ట్యా కుటుంబ సభ్యులతో పాటు ఎవరికి తెలియజేయకూడదని సూచించారు. మరల ఏప్రిల్ 8న చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటూ స్కామర్స్ వీడియో కాల్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆమె అనుమనితురాలుగా ఉందని.. ఆమె అకౌంట్లలో ఉన్న డబ్బులు చట్టబద్ధమైనవి అవునో కాదో అనే విషయం ఆర్బీఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి ప్రాణానికి హానీ ఉందని.. స్లీపర్ సెల్స్ బెదిరించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని హెచ్చరించారు. బాధితురాలి ఫోన్ నిఘాలో ఉందని, ఆమె భద్రతను తాము పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 11న సర్వేలేన్స్ ఆఫీస్ నుంచి అంటూ స్కామర్స్ వీడియో కాల్ చేశారు.
స్కామర్స్ బాధితురాలికి డిఫెన్స్ న్యాయవాది అంటూ మరో వ్యక్తిని పరిచయం చేశారు. ఈ కేసులో బాధితురాలి భర్త అనారోగ్యంగా ఉన్నారని కారణం చూపుతూ... వర్చువల్ హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. అనంతరం బాధితురాలికి తాత్కాలిక బెయిల్ ఆర్డర్స్, రూ.30 లక్షల ష్యురిటీ బాండ్ ను వాట్సాప్ ద్వారా పంపించారు. ఈ కేసులో బాధితురాలి ప్రమేయం లేదని రుజువు చేసుకోడానికి , ఆమె అకౌంట్ లలో ఉన్న డబ్బులను తమకు బదిలీ చేయాలని , ఆర్బీఐ గైడ్ లైన్స్ మేరకు వెరిఫై చేసి మే 6న డబ్బులను తిరిగి పంపిస్తామని నమ్మబలికారు.
స్కామర్ల ఒత్తిడితో బాధిత మహిళ తన ఫిక్స్డ్ డిపాజిట్ లను రద్దు చేసి , బంగారం తాకట్టు పెట్టి, పర్సనల్ లోన్ తీసుకొని స్కామర్స్ తెలిపిన అకౌంట్ లోకి రూ.84 లక్షలను బదిలీ చేసింది. మే 7 వరకు వేచి చూసిన బాధితురాలికి స్కామర్స్ నుంచి ఎలాంటి కాల్స్ రాకపోవడంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇది స్కామ్ అని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.