కల్వకుంట్ల ఫ్యామిలీకేమో ఫామ్​హౌస్​లున్నయ్​.. గరీబోళ్లకు డబుల్​ఇండ్లు ఏవీ?

కల్వకుంట్ల ఫ్యామిలీకేమో ఫామ్​హౌస్​లున్నయ్​.. గరీబోళ్లకు డబుల్​ఇండ్లు ఏవీ?

    బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పెగడపల్లి, వెలుగు: కల్వకుంట్ల కుటుంబానికి వందల ఎకరాల భూమి, ఫామ్ హౌస్ లు ఉన్నాయని.. మరి గరీబోళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,  మూడెకరాల భూమి ఏమయ్యాయని  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పెగడపల్లి, సుద్దపెల్లి, ఆరవెల్లి, మద్దులపల్లి, బతికేపెల్లి, కీచులాటపల్లి, ఏడుమోటలపల్లి, ల్యాగలమర్రి గ్రామాల్లో బహుజన రాజ్యాధికారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్​కుమార్​మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది తన కుటుంబసభ్యులేనని మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో చెప్పారని, సీఎంతో పాటు కేటీఆర్ కుటుంబం వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకొని విలాసంగా జీవిస్తున్నారని, కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇండ్లు లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని, అది కేసీఆర్, కేటీఆర్ లకు కనిపిస్తలేదా అని అన్నారు. 

100 కోట్లతో కేసీఆర్​విమానం కొన్నారని, కానీ రాష్ట్రంలో సామాన్యుడు మోటార్ సైకిల్ కొనలేని స్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్​ను రూ. 170 కోట్లతో నిర్మించుకున్నారని,  కానీ  సుద్దపెల్లి గ్రామంలో 15 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సర్కారు దగ్గర పైసలు లేవంటూ తీవ్ర జాప్యం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గం మాత్రమే ఉన్నాయా అని ప్రశ్నించారు. గజ్వేల్ కు రూ. 970 కోట్లు, సిరిసిల్లకు రూ. వెయ్యి కోట్లు, సిద్దిపేటకు రూ. 840 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేశారని, మరి మిగతా నియోజకవర్గాల ప్రజల పరిస్థితి ఏమిటన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీఎస్పీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు లింబాద్రి, ధర్మపురి నియోజకవర్గ ఇన్​చార్జి నక్క విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.