
- కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు
- హోంమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి
ఎల్బీనగర్, వెలుగు: గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించి, బాధితురాలి కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వారే క్రూరంగా వ్యవహరించడం అమానవీయమన్నారు.దేశంలో ఎక్కడో సంఘటన జరిగితే స్పందించే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నగరంలో జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పోలీసులు కొట్టిన దెబ్బలతో తీవ్ర గాయాలపాలై బీఎన్ రెడ్డి నగర్ లోని శ్యామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడ్త్య లక్ష్మిని ఆదివారం ఆయన పరామర్శించారు
. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..దొంగతనం కేసులో అరెస్టు చేసి ఖదీర్ ఖాన్, మరియమ్మ లాకప్ డెత్ లు పోలీసుల హత్యలేనని ఆరోపించారు. పోలీసులు కేవలం బహుజనుల మీదనే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట రాష్ట్ర కో – ఆర్డినేటర్ డా.వెంకటేశ్ చౌహన్, రాష్ట్ర నేత గుండెల ధర్మేందర్, అధికార ప్ర తినిధి అరుణ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చాట్ల చిరంజీవి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంది లింగం తదితరులు ఉన్నారు.