విద్య, వైద్యం అడిగితే .. పనికిరాని శ్మశానాలు కట్టవట్టిరి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విద్య, వైద్యం అడిగితే .. పనికిరాని శ్మశానాలు కట్టవట్టిరి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్: రాష్ట్రంలో మెరుగైన విద్య, వైద్యం అందేలా చూడాలని ప్రజలు కోరుతుంటే, దాని గురించి పట్టింపు లేకుండా సీఎం కేసీఆర్ ఊరూరా పనికిరాని శ్మశానాలు కట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగింది. చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, మండల కేంద్రంలో తహసీల్దార్​ఆఫీస్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్​వాడీ, ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు. ధనిక రాష్ట్రం అని చెప్తున్న తెలంగాణలో వేతనాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారానికి సమ్మెలు చేస్తుండడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. 

రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందని గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్ కు.. చిన్న ఉద్యోగులకు, అంగన్​వాడీ, ఆశా వర్కర్లకు జీతాలు పెంచేందుకు చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. సీఎంతోపాటు ఆయన కుటుంబీకులు ఎక్కడ పోటీలో ఉంటారో అక్కడే అభివృద్ధి జరుగుతోందని, రానున్న ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన వెంటనే రాత్రికి రాత్రే రూ.450 కోట్లు కామారెడ్డికి నిధులివ్వడం దీనికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రులకు రాష్ట్ర ప్రజలంతా సమానం కాదా అని ప్రశ్నించారు. చిన్న పిల్లలకు, బాలింతలకు సేవ చేస్తున్న అంగన్​వాడీ కార్యకర్తలు.. మాతా శిశు మరణాలు తగ్గించేలా ఊర్లల్లో పని చేస్తున్నా ఎందుకు పట్టించుకోరన్నారు.

 భార్యాభర్తలు ఇద్దరే ఉండే సీఎంకు రూ.170 కోట్ల బిల్డింగ్ ఎందుకన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్ము రూ.80 కోట్లతో విమానం కొన్నాడని, రన్ వే లేదన్న విషయం ఆయనకు తెలియాలన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ కాకుండా ఉండడంపై తనకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ల కోసం కొట్లాడుతుంటే, బీఆర్ఎస్ పార్టీలో దోపిడీ ఎలా చేయాలన్న ఆరాటం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సిర్పూర్ టీ నియోజక వర్గంలో మెయిన్​ రోడ్లు , ఉర్లలో రోడ్లు అధ్వానంగా తయారై జనాలు నడవలేక అవస్థ పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప, అధికారులు పట్టించుకోవడం లేదని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, జిల్లా అధ్యక్షుడు మొర్లే గణపతి, అసెంబ్లీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పాల్గొన్నారు