TSPSC : నమ్మి వస్తే.. 30 లక్షల అభ్యర్థులను మోసం చేశారు

TSPSC : నమ్మి వస్తే.. 30 లక్షల అభ్యర్థులను మోసం చేశారు

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తల్లిదండ్రులు, పుట్టిన ఊరిని వదిలొచ్చిన 30 లక్షల అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్న ప్రవీణ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనను ఇంటికి తరలించారు. ఈ క్రమంలో మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ఎన్ని అరెస్టులు చేసినా, టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేవరకు తన  పోరాటం ఆపనని తేల్చి చెప్పారు. 

ఇది ఒక్కరి సమస్య కాదని టీఎస్పీఎస్సీని నమ్మి వచ్చిన 30 లక్షల అభ్యర్థుల సమస్యని అన్నారు. వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. క్వశ్చన్ పేపర్ల వ్యవహారంలో టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్థన్ రెడ్డి నిద్ర మత్తులో ఉన్నాడని, ఐపీ అడ్రస్ హ్యాక్ చేసి క్వశ్చన్ పేపర్ హ్యాక్ చేసిన విషయం కూడా తెలియనంతగా ఆయన వ్యవహార శైలి ఉందని, ఇందులో టీఎస్పీఎస్సీ చేతకాని తనం బయట పడిందని మండిపడ్డారు. చైర్మెన్.. కాన్ఫిడెన్షియల్ రూమ్ లోకి ఎవరిని పడితే వాళ్లను ఎందుకు వెళ్లనిస్తారు, కాన్ఫిడెన్షియల్ కంప్యూటర్ పాస్ వర్డ్ అందరికీ ఎలా తెలుస్తుందని ప్రశ్నలు లేవనెత్తారు. 

టీఎస్పీఎస్సీ ఎస్ వో శంకర లక్ష్మికి పాస్ వర్డ్ ఎలా తెలిసింది. అంత కాన్ఫిడెన్షియల్ పాస్ వర్డ్ శంకర లక్ష్మి నోట్ బుక్ పై ఎలా రాసి ఉందో తెలపాలని ఆర్ఎస్ ప్రవీన్ అన్నారు. ఇందులో అధికారుల పాత్ర కూడా చాలా ఉందని, జనార్థన్ రెడ్డికి తెలియకుండా ఈ పని జరిగిందంటే నమ్మ బుద్ది కావట్లేదని ప్రవీణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అయిన విషయం కవిత, హరీష్ రావులకు తెలుసని, వాళ్లకు కూడా లీక్ అయిన పేపర్లు అందాయిని ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంపై తన దగ్గర ఆధారాలున్నాయని, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేపట్టినప్పుడు బయట పెడతానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.