కేటీఆర్ అధికార మదంతో మాట్లాడుతున్నడు

కేటీఆర్ అధికార మదంతో మాట్లాడుతున్నడు

సుల్తానాబాద్, వెలుగు: విశ్వ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆదివారం జరిగిన విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్, మారోజు వీరన్న, శ్రీకాంత్ చారి వంటి విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాల పునాదులపై అధికారాన్ని అనుభవిస్తున్న కేటీఆర్ అహంకారం, మదంతో మాట్లాడారన్నారు. పప్పు చారి, గొట్టం గాడు అంటూ చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవడం కాదని..బుల్లెట్ దించి గాయం తగిలాక వాపస్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పడమే దీనికి పరిష్కారమన్నారు. లేకపోతే కర్రు కాల్చి వాత పెట్టేది కూడా విశ్వబ్రాహ్మణులే అన్న సంగతి మర్చిపోవద్దన్నారు.

వడ్రంగి, ఔసుల వంటి కులవృత్తుల వారిని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు తరచూ వేధిస్తున్నారని, పోలీసులు వెళ్లాల్సింది వీరి ఇండ్లకు కాదని..కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి పనుల్లో రూ.వేల కోట్లు దోచుకు తిన్న కేసీఆర్, కేటీఆర్ ఇండ్లకు వెళ్లి అక్రమాలు బయటపెట్టాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో పెద్ద కుంభకోణం చోటుచేసుకుందని ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. బడులలో రిపేర్లు వంటి పనులను కుల వృత్తుల వారికి అప్పజెప్పాల్సి ఉండగా..రూ.1539 కోట్ల కాంట్రాక్ట్​ను మేఘా కంపెనీకి అక్రమ పద్ధతుల్లో అప్పజెప్పారని ఆరోపించారు. బీసీ ప్రధానిగా ఉన్న దేశంలో బీసీ గణన ఎందుకు చేయడం లేదని ఆయన ప్రధానమంత్రి మోడీని ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఉరుమల్ల విశ్వం, నియోజకవర్గ ఇన్​చార్జి దాసరి ఉష, దాసరి హనుమయ్య, మహేశ్​చారి, ఆకారపు శ్రీనివాస్, మహంతి రమేశ్​, గంగాధర్, వెంకన్న, మల్లేశ్, రంజిత్ పాల్గొన్నారు. 

మాజీ సైనికులను మోసం చేయడం దుర్మార్గం

తిమ్మాపూర్: మాజీ సైనికులను మోసం చేయడం కేసీఆర్ దుర్మార్గపు పరిపాలనకు నిదర్శనమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ​జిల్లా  తిమ్మాపూర్ ​మండలం రామకృష్ణ కాలనీలో రాజీవ్​ స్వగృహ లబ్ధిదారులకు, మాజీ సైనికులకు అప్పట్లో కేటాయించిన ఇంటి స్థలాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రామచంద్రంతో కలిసి పరిశీలించారు. తర్వాత వాగేశ్వరి కాలేజీలో విశ్రాంత ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ ఎప్పుడూ బాధితుల పక్షా నిలబడుతుందన్నారు. స్థానిక మంత్రి అనుచరులతో రాజీవ్​ స్వగృహ భూముల వేలం పెట్టి  దోచుకుంటున్నారని, పేదల భూములను యాక్షన్ లో పెట్టిన రాజీవ్​ స్వగృహ ఎండీపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు. ఆ దిశగా బీఎస్పీ కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. రాజీవ్ స్వగృహ లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే, దశలవారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిల్లా సెక్రెటరీ సంగుపట్ల మల్లేశం, మహిళ కన్వీనర్ నిషాని సుమలత పాల్గొన్నారు.