
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారం సంచనంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. "TSPSC లీకుల వ్యవహారం ఎన్నో మలుపులు తీరుగుతున్నది. గ్రూప్–1 ప్రిలిమ్స్ కూడా లీకై ఉండొచ్చొన్న వదంతులు వస్తున్నాయి.. అయినా రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా మౌనంగా ఉంది..! లక్షలాది మంది నిరుద్యోగుల కోసం పోరాడుతున్న BSP కార్యకర్తలను మాత్రం పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ" అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
కాగా, ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిందితుడు ప్రవీణ్ గ్రూప్–1 పరీక్ష రాశాడనే ప్రచారం సాగుతోంది. దీనిపై టీఎస్పీఎస్సీ అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీలో అతడికి 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ OMR షీట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో మాత్రం వైరల్ గా మారింది. కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం నిందితుల కాంటాక్ట్ లిస్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా 9 మంది అరెస్ట్ అయ్యారు.