
కాగజ్ నగర్, వెలుగు : బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో సీఎం కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో పల్లెలకు పోయేందుకు కనీసం రోడ్లు కూడా లేని దుస్థితి ఉండడం బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని, సిర్పూర్ టీ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు, ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని మారుమూల గ్రామాలు గోంది, దుబ్బగూడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కోనేరు కోనప్ప మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సిర్పూర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎన్నో ఏండ్లుగా ఆధిపత్య వర్గానికి చెందిన పార్టీలతో సిర్పూర్ నలిగిపోయిందని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, పేదల పక్షాన నిలబడే బీఎస్పీని ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. బీఎస్పీ తప్ప ఏ పార్టీ కూడా పేదల జీవితాలు మార్చలేదన్నారు. నోటోతో ఓటును కొనాలని చూసేవారికి బుద్ధి చెప్పాలని సూచించారు.
జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరోస్ లక్ష్యం
జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరోస్ లక్ష్యమని స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దివంగత ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ జయంతి సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన స్వేరోస్ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా స్వేరోస్ ముందుకు వెళ్లాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని ఆరోపించారు. ఓటు హక్కుతో రాజ్యాధికారం సాధించాలన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సావిత్రిబాయి పూలే మనవరాలు నీతా రమాకాంత్ హోలే, భంతేజీ దమ్మ సారథి, సిరాజ్ రెహ్మాన్ హాజరయ్యారు. అంతకుముందు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ నుంచి బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు.