ప్రాజెక్టుల్లో అక్రమంగా సంపాదించలే..ఫామ్ హౌస్ కట్టుకోలే

ప్రాజెక్టుల్లో అక్రమంగా సంపాదించలే..ఫామ్ హౌస్ కట్టుకోలే

తిమ్మాపూర్, వెలుగు: తమ మీటింగ్‌కు వస్తున్న వాళ్లను అక్రమంగా అరెస్టు చేయడంపై రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్​ఎస్. ప్రవీణ్​కుమార్ ఫైర్ అయ్యారు. అక్రమంగా ప్రాజెక్టుల్లో డబ్బులు సంపాదించామా? అట్ల సంపాదించిన సొమ్ముతో ఫామ్ హౌస్ లు కట్టుకున్నమా? ఓట్లు కొనుక్కుంటున్నామా? అని రాష్ట్ర సర్కార్​ను నిలదీశారు. గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత అలుగునూరులో జరిగిన బహుజన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పేద ప్రజల్లో కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, ఇంకా 99 శాతం మందికి ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెపల్లెకు వెళ్లి పేదల సమస్యలు తెలుసుకుంటానని, వారి బతుకులను బాగు చేసేందుకు పోరాటం చేస్తానని చెప్పారు. పేదల సమస్యలను చూసి, తాను చలించిపోయాయని.. వాళ్లకు ఏదైనా చేయాలనే తపనతోనే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపారు. బహుజన రాజ్యాధికారం దిశగా రానున్న రోజుల్లో అందరితో కలిసి పోరాటం చేస్తానని, పల్లెపల్లెకు వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తానన్నారు.

ఆ చెంచాల ఉచ్చులో పడకండి

కొందరు చెంచాలు అంబేద్కర్ పేరు చెప్పుకుని మోసం చేస్తున్నారని ప్రవీణ్​కుమార్ విమర్శించారు. ఆ చెంచాల ఉచ్చులో పడితే మరో 200 ఏళ్లు వెనక్కి పోతామన్నారు. ‘‘50 ఏళ్ల మీ మేనిఫెస్టోలు ఎక్కడ పోయాయి. పేదల బతుకుల్లో ఎందుకు మార్పురాలేదు. మా కష్టార్జితంగా కట్టిన పన్నులు ఏమయ్యాయి. అందుకే ఆరేళ్ల సర్వీసును తృణ ప్రాయంగా వదిలేసి మీ కోసం వచ్చా. మీలాగా ఆస్తుల కోసం, పదవుల కోసం కొట్లాడలేదు. మా బిడ్డల కోసం జీవితాంతం పనిచేస్త’’ అని అన్నారు. 

ఉప ఎన్నిక డబ్బులు పెడితే చాలు.. 

రాష్ట్రంలో కులాల అభివృద్ధి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని సర్కార్ చెబుతోందని.. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం సర్కార్ ఖర్చు చేస్తున్న డబ్బులను పేదల అభివృద్ధికి కేటాయిస్తే చాలు, వారి బతుకులు బాగు పడుతాయని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న గొర్రెల పథకంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని యాదవుల పిల్లలకు సూచించారు.