
- సీఎంఓలో బీసీ అధికారులే లేరు: బీఎస్పీ స్టేట్చీఫ్ ప్రవీణ్ కుమార్
సుల్తానాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ దేశంలో కిసాన్ సర్కార్ ఏర్పాటు చేస్తానంటూ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని బీఎస్పీ స్టేట్చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 152వ రోజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక, నారాయణపూర్, చిన్న బొంకూర్, రేగడి మద్దికుంట, అల్లిపూర్, తొగరాయి గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. పార్టీ జెండాలను ఆవిష్కరించి ప్రసంగించారు. రుణమాఫీ కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది కౌలు రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం ఆఫీసులో ఒక్క బీసీ అధికారి కూడా లేడని చెప్పారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు అంటూ పట్టణానికి వెలుపల స్థలాలు చూపిస్తున్నారని, ఉన్నత వర్గాలకు మాత్రం భవనాలను మహానగరం మధ్యలో నిర్మించి ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మాదిరిగా ఉపాధి నిధులు కూడా రాష్ట్రంలో దుర్వినియోగం అవుతున్నాయన్నారు. ఉపాధి నిధులపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సుల్తానాబాద్ ప్రాంతంలో రైతులకు అన్యాయం చేసిన ప్రసాద్ సీడ్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.